సోనియా గాంధీకి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు బ్రేకులు!

December 26, 2020


img

కాంగ్రెస్ పార్టీలో సోనియా, రాహుల్ గాంధీల మాటే శాసనం. వారి నిర్ణయాలకు తిరుగు ఉండదు. కానీ ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు వారిని అడుగు ముందుకు వేయకుండా నిలబెట్టేస్తున్నారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు మీడియాలో వార్తలు రాగానే ఆ పదవికి పోటీ పడిన జగ్గారెడ్డి, వి.హనుమంతరావులు కాంగ్రెస్‌ అధిష్టానాన్ని తొందరపడవద్దని ఘాటుగా హెచ్చరించారు. ఒకవేళ రేవంత్‌ రెడ్డికి పదవి కట్టబెడితే తాము పార్టీని వీడి వెళ్లిపోతామని కుండబద్దలు కొట్టారు.

జగ్గారెడ్డి మరో అడుగు ముందుకు వేసి సోనియా గాంధీకి లేఖ వ్రాశారు. పిసిసి అధ్యక్షుడి ఎంపికలో తొందరపడవద్దని, ఏకాభిప్రాయంతోనే ఎన్నుకోవాలని సూచించారు. ఒకవేళ అది సాధ్యం కాదనుకొంటే, వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలోగా నాగార్జునసాగర్ ఉపఎన్నికలు జరుగనున్నందున అప్పటివరకూ ఉత్తమ్‌కుమార్ రెడ్డినే పిసిసి అధ్యక్షుడిగా కొనసాగించాలని లేఖలో సూచించారు. సీనియర్ నాయకుడు కె.జానారెడ్డి నేతృత్వంలోనే ఆ ఎన్నికలను ఎదుర్కోవాలని సూచించారు. రాష్ట్రంలో బిజెపికి ఎమ్మెల్యేలగా పోటీ చేయగల బలమైన అభ్యర్ధులు లేరు గనుక ఆ పార్టీ టిఆర్ఎస్‌-మజ్లీస్‌లను పరోక్షంగా వాడుకొంటూ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నిస్తోందని, కనుక ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పగించాలి తప్ప తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని జగ్గారెడ్డి లేఖలో సూచించారు. 


Related Post