రేవంత్‌కు ఇస్తే పార్టీకి గుడ్ బై: విహెచ్

December 25, 2020


img

రేవంత్‌ రెడ్డికి తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ఖరారు అయినట్లు మీడియాలో వస్తున్న వార్తలపై సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు భగ్గుమన్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ రేవంత్‌ రెడ్డిపై నిప్పులు కక్కారు. “ఇదంతా మానిక్కం ఠాగోర్‌ నిర్వాకమే. రేవంత్‌ రెడ్డికి అందరినీ డబ్బుతో మేనేజ్ చేయడం బాగావచ్చు. ఆ డబ్బుకు ఆశపడే ఆయన మా హైకమాండ్‌ను ఒప్పించి ఉండవచ్చు. మానిక్కం ఠాగోర్‌తో మాట్లాడేందుకు నేను రెండు మూడు రోజుల నుంచి ఫోన్‌ చేస్తున్నాను కానీ ఆయన నా ఫోన్‌ ఎత్తడం లేదు.. అంటే అర్ధం ఏమిటి? ఆయన మా అధిష్టానాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు. మేము ఎన్నిసార్లు ప్రయత్నించినా మాకు మా సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ లభించడం లేదు. కానీ రేవంత్‌ రెడ్డి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఢిల్లీ వెళ్ళి మా అధిష్టానాన్ని కలిసి మాట్లాడగలుగుతున్నాడు. అంటే ఆయన, కొందరు పార్టీ పెద్దలు కలిసి మా అధిష్టానాన్ని కూడా మేనేజ్ చేస్తున్నారని అర్ధమవుతోంది. రేవంత్‌ రెడ్డి మీడియాను మేనేజ్ చేసి పాపులర్ అయ్యాడు తప్ప సొంతంగా కాదు.        

ఒకవేళ రేవంత్‌ రెడ్డికి అధ్యక్ష పదవి ఇస్తే నాతో సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీలో చిరకాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డిలను కాదని తెలంగాణను వ్యతిరేకించిన, భూకబ్జాలకు పాల్పడిన రేవంత్‌ రెడ్డికి ఈయవలసిన అవసరం ఏమిటి? ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి అధ్యక్షుడైతే...రేపు జైలుకు వెళితే ఆయనను కలిసేందుకు మేమందరం రోజూ జైలుకు వెళ్ళాలా? ఏ ఉద్యోగంలో చేరాలన్నా ముందు అభ్యర్ధి చరిత్రను చూస్తారు. కానీ రేవంత్‌ రెడ్డి చరిత్రను ఎందుకు చూడటంలేదు? సెక్యులర్ విధానాలతో ముందుకు సాగే కాంగ్రెస్ పార్టీని ఆర్‌ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రేవంత్‌ రెడ్డికి ఎలా అప్పజెపుతారు? 

రేవంత్‌ రెడ్డి అంత గొప్ప నాయకుడైతే కొడంగల్‌లో ఎందుకు ఓడిపోయాడు? దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించలేకపోయాడు? ఈ ఎన్నికలలోనే పార్టీని గెలిపించలేని వ్యక్తి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఎలా గెలిపించగలడు? అసలు ఆ రెండు ఎన్నికలలో ఓటమి గురించి పార్టీలో ఎందుకు చర్చించలేదు?

ఒకవేళ మళ్ళీ రెడ్లకే పార్టీ పగ్గాలు అప్పగించదలిస్తే మొదటి నుంచి పార్టీలో ఉంటూ తెలంగాణ కోసం పోరాడిన కోమటిరెడ్డికి ఇచ్చినా అభ్యంతరం లేదు. కానీ రేవంత్‌ రెడ్డికి ఇస్తామంటే ఊరుకోబోము. ఒకవేళ రేవంత్‌ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పజెప్పితే మొట్టమొదట నేనే పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయి, అతని అక్రమార్జనలపై సిబిఐకి ఫిర్యాదు చేస్తాను. అతని గత చరిత్ర అంతా తవ్వి తీసి ప్రజల ముందు పెడతాను,” అని హెచ్చరించారు. 


Related Post