పిసిసి అధ్యక్ష పదవి రేవంత్‌ రెడ్డికే...నా?

December 25, 2020


img

తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి ఎంపిక తుది దశకు చేరుకొన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడినందున టిఆర్ఎస్‌, బిజెపిలను ధీటుగా ఎదుర్కోగల సత్తా ఉన్న రేవంత్‌ రెడ్డికే పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. కానీ రేవంత్‌ రెడ్డికి ఆ పదవి కట్టబెడితే పార్టీలో సీనియర్లు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంటుందని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. కనుక అసంతృప్త నేతలలో కొందరు సీనియర్లను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలోకి, కొంతమందికి రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా అందరినీ సంతృప్తపరచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక రేపు, ఎల్లుండి రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో నేరుగా మాట్లాడి వారిని బుజ్జగించి ఒప్పించిన తరువాతే పిసిసి కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించాలని కాంగ్రెస్‌ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన సోమవారంలోగా కొత్త పిసిసి అధ్యక్షుడు ఎవరో స్పష్టతరావచ్చు. 

అయితే ఆ పదవిని ఎవరు చేపట్టినా అది వారికి ముళ్ళ కిరీటమే అవుతుంది తప్ప పూలపాన్పు కాబోదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓ పక్క పార్టీలో అసంతృప్త నేతలను ఎదుర్కొంటూనే, మరో పక్క టిఆర్ఎస్‌, బిజెపిలను ఎదుర్కోవలసి ఉంటుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో చాలా ఉత్సాహంగా ఉన్న బండి సంజయ్‌ త్వరలోనే కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ పార్టీలలో నుంచి అనేకమంది ముఖ్య నేతలు, కార్యకర్తలు బిజెపిలో చేరబోతున్నట్లు బహిరంగంగానే చెప్పారు. కనుక పిసిసి అధ్యక్ష పదవి ఎవరు చేపట్టినా ముందుగా ఆ ఫిరాయింపులను అడ్డుకోవలసి ఉంటుంది లేకుంటే పార్టీ మరింత బలహీనపడుతుంది. అప్పుడు పార్టీని నడిపించడం ఇంకా కష్టమవుతుంది. 

త్వరలోనే ఎమ్మెల్సీ, మునిసిపల్, నాగార్జున సాగర్ ఉపఎన్నికలు జరుగనున్నాయి. వాటిలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకోవలసి ఉంటుంది. గెలిపించుకోలేకపోయినా కనీసం తన రెండవస్థానం నిలుపుకోవలసి ఉంటుంది. కనుక ఇల్లలకగానే పండుగ కాదన్నట్లు పిసిసి అధ్యక్ష పదవి దక్కించుకోగానే సరిపోదు. ఈ అగ్నిపరీక్షలన్నీ ఎదుర్కోకతప్పదు.           



Related Post