ఆ జాబితాలో నా పేరు ఎందుకు లేదు? జగ్గారెడ్డి

December 25, 2020


img

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌-చార్జ్ మానిక్కం ఠాగోర్‌పై సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పిసిసి అధ్యక్ష పదవి రేసులో తాను కూడా ఉన్నానని జగ్గారెడ్డి మొదటి నుంచి చెపుతూనే ఉన్నారు. ఇటీవల మానిక్కం ఠాగోర్‌ గాంధీభవన్‌లో వరుస సమావేశాలు నిర్వహించినప్పుడు తాను కూడా ఈ రేసులో ఉన్నానని జగ్గారెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు కూడా. కానీ మానిక్కం ఠాగోర్‌ ఢిల్లీకి వెళ్ళి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్కలతో కూడిన తుది జాబితాను కాంగ్రెస్‌ అధిష్టానానికి సమర్పించారని, కనుక ఆ ముగ్గిరిలో ఎవరో ఒకరికి పిసిసి అధ్యక్ష పదవి లభించనుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కనుక జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తి, అసహనానికి గురవడం సహజం.

తాను రేసులో ఉన్నానని స్పష్టంగా చెప్పిన తరువాత కూడా మానిక్కం ఠాగోర్‌ తన పేరును ఆ జాబితాలో నుంచి ఎందుకు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిసిసి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నవారందరి పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి ఇస్తే దానిపై అధిష్టానమే నిర్ణయం తీసుకొని ఉండేదని కానీ మానిక్కం ఠాగోర్‌ పూర్తి జాబితాను ఇవ్వకుండా జాబితాలో కొందరి పేర్లను ఎందుకు తొలగించారని మండిపడుతున్నారు. అవసరమైతే తాను కూడా త్వరలోనే ఢిల్లీ వెళ్ళి పిసిసి అధ్యక్ష పదవిని తనకే ఇవ్వాలని సోనియా, రాహుల్ గాంధీలను కోరుతానని అన్నారు.


Related Post