చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2020

December 24, 2020


img

కరోనా విలయతాండవం...కరోనా మరణాలు...లాక్‌డౌన్‌...నిరుద్యోగం.... సర్వ శక్తివంతమైన ప్రభుత్వాల మొదలు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలవరకు అందరికీ ఆర్ధిక కష్టాలు...విద్యాసంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మూతపడటం...ఇలా చెప్పుకొంటూపోతే ఆ జాబితాకు అంతే లేదు. 2020వ సంవత్సరంలో అన్ని బాధలు, కష్టాలు, కన్నీళ్ళే కనిపిస్తున్నాయి. కనుక కరోనామహమ్మారి యావత్ ప్రపంచదేశాలకు 2020ని ఓ భయానకమైన చేదు జ్ఞాపకంగా మిగిల్చింది. 

కరోనా...లాక్‌డౌన్‌ కష్టాల సమయంలోనే దేశంలో ఒక మానవతామూర్తి దేవుడిలా సాక్షాత్కారించాడు. అతనే బాలీవుడ్, టాలీవుడ్ నటుడు సోనూసూద్. దేశ ప్రజలకు ఆయన చేస్తున్న సేవల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. నేటికీ ఓ మహాయజ్ఞoలా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఎంతో మంది నిరుపేదలకు ఏకైక ఆశాదీపంగా నిలుస్తున్నాడు. ఆయన దాతృత్వానికి... మానవతావాదానికి అవదులు లేవు. భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించుకోవలసిన గొప్ప వ్యక్తి అని చెప్పక తప్పదు. 

రాజకీయంగా చూస్తే ఈ ఏడాది బిజెపికి బాగానే సాగిందని చెప్పవచ్చు. మరిన్ని రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకోగలిగింది. అయితే వ్యవసాయచట్టాల విషయంలో ఢిల్లీలో రైతుల ఆందోళనలతో కేంద్రప్రభుత్వం ప్రతిష్ట మసకబారుతోందని చెప్పక తప్పదు. ఈ సమస్యకు రాజకీయకోణం కూడా ఉన్నందున రాజకీయంగానే దానిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోంది. కానీ రైతుల ఆందోళనలు ఇంకా కొనసాగితే రాజకీయంగా బిజెపికి నష్టం తప్పకపోవచ్చు.          

తెలంగాణ రాజకీయాలలో 2020లో పెను మార్పులు జరిగాయని చెప్పవచ్చు. తిరుగేలేదనుకొన్న టిఆర్ఎస్‌కి ఉనికే లేదనుకొన్న బిజెపి చేతిలో ఎదురుదెబ్బలు తింటుండటం చాలా ఆశ్చర్యకరమే. మొదట లోక్‌సభ ఎన్నికలు, ఆ తరువాత వరుసగా దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఓటములు టిఆర్ఎస్‌ జీర్ణించుకోవడం కష్టమే. 

రాష్ట్రంలో బిజెపికి ఊపిరి ఊదిన టిఆర్ఎస్‌కు ధీటుగా నిలబెట్టిన ఘనత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కే దక్కుతుంది. గతంలో ఏ ఎన్నికలు జరిగినా రెండో స్థానంలో నిలిచే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ ఎన్నికలలోను అడ్రస్ లేకుండా పోతోంది. పైగా విజయశాంతి వంటి అనేక మంది నేతలు బిజెపిలోకి క్యూ కట్టడంతో పార్టీ మరింత బలహీనపడింది. ఇవి సరిపోవన్నట్లు పిసిసి అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్‌ నేతలు కీచులాడుకోవడంతో పార్టీ ప్రతిష్ట మసకబారింది. కనుక ఏవిధంగా చూసినా కాంగ్రెస్‌ పార్టీకి 2020 చాలా దురదృష్టకరమైన సంవత్సరమే అని చెప్పవచ్చు. 

ఇక ఈ ఏడాది ఆగస్ట్ మళ్ళీ అక్టోబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలు, వాటితో హైదరాబాద్‌ నగరంలో వరదలు ప్రజలకు చాలా కష్టాలను, చేదు జ్ఞాపకాలను మిగల్చగా, తెలంగాణ ప్రభుత్వం సర్వత్రా విమర్శలు మూటగట్టుకొంది.   

కరోనా... లాక్‌డౌన్‌లతో రాష్ట్రం అల్లాడిపోయినప్పటికీ ఈ ఏడాది భారీ పెట్టుబడులు రావడం చాలా సంతోషకరమైన విషయమే. అమెజాన్ వెబ్‌సర్వీసస్‌, ఫియట్ (గ్లోబల్ డిజిటల్ ల్యాబ్), ఒప్పో (ఇన్నోవేషన్ ల్యాబ్) వంటి అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో వేలకోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ఈ ఏడాదికి ఓ మంచి ముగింపుగానే చెప్పుకోవచ్చు. మరో వారం రోజులలో కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. మరో నెలలో కరోనాకు వ్యాక్సిన్‌ కూడా వచ్చేస్తోంది. కనుక 2021 సంవత్సరమైన ప్రశాంతంగా సుఖంగా సాగిపోతుందని ఆశిద్దాం. 


Related Post