ఒక్కో కార్పొరేటర్‌కు 5 కోట్లు ఆఫర్!

December 24, 2020


img

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ టిఆర్ఎస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఇవాళ్ళ మీడియాతో మాట్లాడుతూ, “మేయర్ పదవి దక్కించుకోవడానికి టిఆర్ఎస్‌ అప్పుడే మా పార్టీ కార్పొరేటర్లకు గాలం విసురుతోంది. టిఆర్ఎస్‌లోకి వచ్చేస్తే ఒక్కో కార్పొరేటర్‌కు రూ.5 కోట్లు చొప్పున ఇస్తామని ప్రలోభ పెడుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను హడావుడిగా నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం నేటి వరకు మేయర్ ఎన్నిక ఎందుకు నిర్వహించడం లేదు?” అని ప్రశ్నించారు.

పాతబస్తీలోని రోహ్యింగాల గురించి మాట్లాడుతూ, “తెలంగాణ పోలీసులు చాలా సమర్ధులు. సిఎం కేసీఆర్‌ వారికి కేవలం 15 నిమిషాలు సమయం ఇస్తే పాతబస్తీలో అక్రమంగా నివశిస్తున్న రోహ్యింగాలను, దేశవ్యతిరేక శక్తులను ఏరివేయగలరు. ఈ విషయంలో సిఎం కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే పోలీసులకు అనుమతివ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను,” అని అన్నారు. 

త్వరలోనే తాను రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర... ఆ తరువాత పాదయాత్ర చేపడతానని బండి సంజయ్‌ చెప్పారు. ఖమ్మం, వరంగల్‌, సిద్ధిపేట మునిసిపల్ ఎన్నికలకు ముందు టిఆర్ఎస్‌కు చెందిన పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు బిజెపిలో చేరబోతున్నారని బండి సంజయ్‌ తెలిపారు.     

టిఆర్ఎస్‌ తమ కార్పొరేటర్లను ప్రలోభపెడుతోందని ఆరోపిస్తున్న బండి సంజయ్‌ టిఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలను తమ పార్టీలో చేర్చుకోబోతున్నామని చెప్పడం చూస్తే బిజెపి కూడా అదే పని చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దేశంలో ఏ మారుమూల గ్రామంలోనైనా ఉగ్రవాదులు లేదా దేశవిద్రోహులు ఉన్నట్లు కేంద్ర నిఘా సంస్థ భావిస్తే రాష్ట్ర ప్రభుత్వంతో సంబందం లేకుండా నేరుగా అక్కడకు చేరుకొని వారిని అరెస్ట్ చేస్తుంటుంది. పాతబస్తీలో దేశవిద్రోహులు, అక్రమంగా నివశిస్తున్న రోహ్యింగాలు ఉన్నారని బండి సంజయ్‌కి తెలిసి ఉన్నప్పుడు ఆయనే కేంద్రప్రభుత్వానికి ఈవిషయం తెలియజేసి వారిని అరెస్ట్ చేయించవచ్చు కదా? కానీ ఎందుకు చేయించడం లేదు?అంటే ఈ విషయంలో బిజెపికి కూడా చిత్తశుద్ది లేదనుకోవాలా?రోహ్యింగాల అంశాన్ని జాతిభద్రతకు సంబందించిన అంశంగా కాక కేవలం రాజకీయంగానే చూస్తోందా? టిఆర్ఎస్‌-మజ్లీస్‌లను ఇబ్బంది పెట్టేందుకే ఇటువంటి వాదనలు చేస్తోందా?అనే సందేహం కలుగుతుంది.


Related Post