అన్నీ ఉచితం... ప్రజలకే క్షవరం

December 24, 2020


img

రాజకీయ పార్టీలు... ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికలలో గెలిచేందుకు ఏదో ఓ కొత్త ఉచిత పధకం ప్రకటిస్తుంటాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు పోటాపోటీగా వరదసాయం, ఉచిత త్రాగునీరు, ఉచిత విద్యుత్ వంటి అనేక హామీలు గుప్పించాయి. ఎన్నికలలో ఓడిపోయిన పార్టీలకు ఆ హామీలు అమలుచేయనవసరం లేదు కానీ రాష్ట్రంలో టిఆర్ఎస్‌ అధికారంలో ఉన్నందున గ్రేటర్ ఎన్నికలలో గెలవలేకపోయినా ఆ హామీలను అమలుచేయక తప్పడం లేదు.

ఇప్పటికే ఒక్కో కుటుంబానికి నెలకు 20,000 లీటర్లు మంచినీటిని ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్దమైంది. ఇప్పుడు మరో ఎన్నికల హామీ సెలూన్లు, లాండ్రీలు, ధోభీ ఘాట్లకు ఉచిత విద్యుత్ హామీని అమలుచేసేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం.

ఈ విధంగా ఉచితంగా పంచుకొంటూపోతే దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? విచ్చలవిడిగా అప్పులు తెచ్చి ఖర్చు చేస్తుంటాయి. లేదా లబ్దిదారులతో సహా ప్రజలందరూ కూడా పన్నుల రూపేణా పెంచిన ఛార్జీల రూపేణా చెల్లిస్తున్న డబ్బునే ఈవిధంగా ఖర్చు చేస్తుంటుంది. ప్రజల కోసం ప్రకటించే సంక్షేమ పధకాలకు ప్రజలే చెల్లించడమంటే ప్రభుత్వాలు కుడి చేత్తో ఇచ్చి ఆ చేత్తో తీసుకోవడమే అనుకోవచ్చు. ప్రభుత్వాలు ఆర్ధిక క్రమశిక్షణ పాటించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఉచిత పధకాలు ప్రకటించుకొంటూ పోతే ఏదో ఓ రోజు మన ఆర్ధికవ్యవస్థ కుప్పకూలడం ఖాయం. కనుక ఉచిత పధకాలు ప్రకటించి మళ్ళీ ప్రజలపై భారం మోపే బదులు వ్యవస్థల పనితీరు మెరుగుపరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. 


Related Post