మార్చిలోగా కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారు: రెడ్యా నాయక్

December 24, 2020


img

టిఆర్ఎస్‌ డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ వచ్చే ఏడాది మార్చిలోగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. 

సిఎం కేసీఆర్‌ చాలా కాలంగా జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించాలనుకొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకవేళ  సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళినట్లయితే అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోను రెండో స్థానంలో ఉన్న మంత్రి కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారనేది బహిరంగ రహస్యమే. 

అయితే ఇటీవల ఎన్నికలలో వరుస అపజయాలతో టిఆర్ఎస్‌కు చాలా ఎదురుదెబ్బలు తగిలాయి. రాష్ట్రంలో బిజెపి బలపడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు కూడా కనిపించాయి. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకొనేందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బిజెపిలోకి ఫిరాయింపజేసుకొంటోంది. వచ్చే శాసనసభ ఎన్నికలలో గెలిచి తెలంగాణలో కూడా అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని కుండబద్దలు కొట్టినట్లు చెపుతున్న బిజెపి రేపు టిఆర్ఎస్‌పై కూడా అటువంటి ప్రయోగాలు చేయడం ఖాయమేనని పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలను చూస్తే అర్దమవుతోంది. కనుక టిఆర్ఎస్‌ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు సిఎం కేసీఆర్‌ ప్రభుత్వ పగ్గాలను కేటీఆర్‌కు అప్పజెప్పుతారనుకోలేము. 

కానీ కేంద్రంలో యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఎప్పుడు తలుచుకొంటే అప్పుడు ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఆయన భయపడి వెనక్కు తగ్గడం వలన ఇప్పుడు మళ్ళీ ఎన్నటికైనా ఆ అవకాశం లభిస్తుందో లేదో తెలియని స్థితిలో ఉన్నారు. కనుక రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉండగానే కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయకపోతే ఆ తరువాత రాహుల్ గాంధీకి ఎదురైన పరిస్థితే కేటీఆర్‌కు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక బహుశః 2023 శాసనసభ ఎన్నికలలోగా ఏదో ఓ సమయంలో కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందనే భావించవచ్చు. 


Related Post