వ్యవసాయచట్టాలపై కేసీఆర్‌ వైఖరి ఏమిటి?విహెచ్

December 23, 2020


img

కేంద్రప్రభుత్వం తెచ్చిన వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు ఈనెల 8న భారత్‌ బంద్‌ ప్రకటించినప్పుడు సిఎం కేసీఆర్‌ దానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు అందరూ దానిలో పాల్గొని విజయవంతం అయ్యేలా చేశారు. కానీ అవే చట్టాలను వ్యతిరేకిస్తూ హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ విద్యార్దులు సోమవారం నిరసన దీక్షలు చేస్తుంటే, దానిలో పాల్గొనేందుకు వెళుతున్న సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావును పోలీసులు అడ్డుకొన్నారు. ఆయన హైదరాబాద్‌ నుంచి కారులో జనగామ జిల్లాలోని పెంబర్తి బైపాస్ రోడ్డువద్దకు చేరుకొన్నప్పుడు పోలీసులు ఆయనను అడ్డుకొని లింగాల ఘణపురం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో అందరికంటే ముందు సిఎం కేసీఆరే వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. టిఆర్ఎస్‌ చేత బంద్‌ కూడా చేయించాడు. కానీ నన్ను దారిలో అడ్డుకొని అరెస్ట్ చేయించాడు. ఇదెక్కడి న్యాయం?ఇంతకీ వ్యవసాయచట్టాలపై ఆయన వైఖరి ఏమిటి? ఆయన రైతులవైపున్నాడా... లేదా కేంద్రప్రభుత్వంవైపున్నాడా?ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని, అమిత్ షాలను కలిసి హైదరాబాద్‌ తిరిగివచ్చిన తరువాత కేసీఆర్‌ చల్లబడిపోయాడు. ఆయన రైతులను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలబడి పోరాడుతూనే ఉంటుంది,” అని వి.హనుమంతరావు అన్నారు.


Related Post