ఢిల్లీలో రైతుల కష్టాలపై మంత్రి నిరంజన్ ఆవేదన

December 23, 2020


img

రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఇవాళ్ళ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “అన్నం పెట్టే రైతన్నలు ఢిల్లీలో ఎముకలు కోరికే చలిలో రోడ్లపై గడుపుతుండటం చాలా బాధాకరం. ఇప్పటి వరకు ఈ ఆందోళనలలో 41 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. కనుక కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా బెట్టు వీడి వారు కోరుతున్నట్లుగా వ్యవసాయచట్టాలలో మార్పులు చేయాలి. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది రైతులు వారి ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నా కేంద్రప్రభుత్వంలో చలనం కలుగకపోవడం చాలా బాధాకరం. పంటల మద్దతు ధరపై వారి డిమాండ్లను కేంద్రం స్పందించాలి. దేశంలో ప్రతీఒక్కరిపై రైతన్నలను కాపాడుకోవలసిన బాధ్యత ఉంది,” అని అన్నారు. 

వ్యవసాయమంత్రిగా నిరంజన్ రెడ్డి రైతుల కష్టాలపై స్పందించిన తీరు చాలా అభినందనీయమే. అయితే రాష్ట్రంలో మక్కలు, కంది, మిర్చి, పసుపు, వరి, పత్తి రైతులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఇదేవిధంగా పలుమార్లు రోడ్లపై బైటాయించి ఆందోళనలు చేసినప్పుడు కూడా మంత్రిగా నిరంజన్ రెడ్డి ఇదేవిధంగా స్పందించి ఉంటే బాగుండేది. ఇటీవల వరదలకు పంటలు నష్టపోయి రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నప్పుడు మంత్రిగా నిరంజన్ రెడ్డి వారిని ఓదార్చి ప్రభుత్వం తరపున ఏదైనా సాయం అందజేసి ఆదుకొని ఉండి ఉంటే అందరూ హర్షించేవారు. నిజామాబాద్‌లోని పసుపు రైతుల గోడును పట్టించుకోకపోవడంవలననే లోక్‌సభ ఎన్నికలలో వారు సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను కాదని ధర్మపురి అరవింద్‌ను గెలిపించిన సంగతి అందరికీ తెలుసు. కనుక రాష్ట్రంలో రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నప్పుడు వారి సమస్యలపై మాట్లాడకుండా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల గురించి మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం రాజకీయమే అనుకోవలసి ఉంటుంది. 


Related Post