పిసిసి రేసులో భట్టి విక్రమార్క?

December 23, 2020


img

తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కోసం ఎంపీలు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ పడుతున్నందున వారిలో ఎవరో ఒకరికి ఆ పదవి లభించవచ్చని ఊహాగానాలు వినిపిస్తుంటే, ఆ జాబితాలో మరో సీనియర్ నేత భట్టి విక్రమార్క పేరు కూడా చేరినట్లు తెలుస్తోంది. కొత్త పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మానిక్కం ఠాగోర్ గాంధీభవన్‌లో నాలుగైదు రోజులు నేతలందరితో వరుస సమావేశాలు నిర్వహించిన తరువాత ఓ జాబితాను తయారుచేసి ఢిల్లీకి వెళ్ళి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో పెట్టారు. తుది జాబితాలో భట్టి విక్రమార్క పేరున్నట్లు సమాచారం. 

ఆ పదవిని రేవంత్‌ రెడ్డికి ఇవ్వకూడదని...ఆయనకు తప్ప ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదని కొందరు సీనియర్ కాంగ్రెస్‌ నేతలు చెప్పడం ఇందుకు ఒక కారణమైతే, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఇస్తే రేవంత్‌ రెడ్డి అలకపాన్పు ఎక్కే అవకాశం ఉంటుంది కనుక మద్యే మార్గంగా భట్టి విక్రమార్క పేరును ప్రతిపాదించిన్నట్లు సమాచారం. పార్టీలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని వి.హనుమంతరావు వంటి కొందరు బీసీ నేతలు వాదిస్తున్నందున ఆ వర్గానికి చెందిన భట్టి విక్రమార్కకు పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టినట్లయితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కాంగ్రెస్‌ అధిష్టానం కొత్త పిసిసి అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది.      

అయితే ఈ పదవిని ఎవరికి కట్టబెట్టినప్పటికీ వారు ఓ పక్క టిఆర్ఎస్‌, బిజెపిల ధాటిని తట్టుకొంటూనే రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల మళ్ళీ నమ్మకం కలిగించవలసి ఉంటుంది. కాంగ్రెస్‌ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొని 2023 శాసనసభ ఎన్నికలకు పార్టీని సిద్దం చేయవలసి ఉంటుంది. వాటికంటే ముందే త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ, ఖమ్మం, వరంగల్‌ మునిసిపల్ ఎన్నికలు, ఆ తరువాత నాగార్జునసాగర్ ఉపఎన్నికల అగ్నిపరీక్షలను ఎదుర్కొని తమ నాయకత్వశక్తిని నిరూపించుకోవలసి ఉంటుంది. మరివన్నీ కొత్త అధ్యక్షుడికి సాధ్యమేనా?



Related Post