భారత్‌లో మళ్ళీ కరోనా సీరియల్ షురూ?

December 22, 2020


img

గత పది నెలలుగా ప్రభుత్వాలు, వైద్యులు, వైద్యసిబ్బంది, శాస్త్రవేత్తలు, ఆరోగ్యకార్యకర్తలు, పారిశుద్య సిబ్బంది అందరూ ఎంతగానో శ్రమించి అతికష్టం మీద కరోనాను కట్టడిచేశామని నిట్టూర్పు విడిచేలోగానే అది మళ్ళీ జన్యుపరంగా రూపం మార్చుకొని బ్రిటన్‌పై దాడి చేసింది. దానికి శాస్త్రవేత్తలు ‘వీయూఐ 202012/1’ అనే పేరు పెట్టారు. అయితే అందరికీ అర్ధమయ్యేందుకు ‘కోవిడ్19 స్ట్రెయిన్’ అని మీడియాలో పేర్కొంటున్నారు. 

బ్రిటన్‌లో ఈ కోవిడ్19 స్ట్రెయిన్ బయటపడగానే ఆ దేశం ప్రపంచ ఆరోగ్యసంస్థను యావత్ ప్రపంచదేశాలను అప్రమత్తం చేసింది. కానీ భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా కరోనాకు సీక్వెల్ సినిమా ఎప్పుడో మొదలైపోయిందని ఆలస్యంగా గ్రహించారు. 

భారత్‌లో అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలలో విదేశాల నుంచి వస్తున్నవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు లేకపోయినా క్వారెంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే విదేశాల నుంచి భారత్‌కు వచ్చినవారిని గుర్తించేందుకు అన్ని రాష్ట్రాలలో గాలింపు కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఆవిధంగా కొన్ని రోజుల క్రితం యూకే నుంచి చెన్నైకు తిరిగివచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్య సిబ్బంది ఇవాళ్ళ గుర్తించి వెంటనే అతనిని కరోనా ఆసుపత్రికి తరలించారు. అతనికి సోకిన కరోనా పాతదేనా లేడా ‘కోవిడ్19 స్ట్రెయిన్’ అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది. ఈ ‘కోవిడ్19 స్ట్రెయిన్’ కరోనా కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని, కానీ కరోనాలాగే వ్యాధి తీవ్రత కలిగి ఉంటుందని తేలింది. దీనిని కొత్తగా కనుగొన్న కోవాక్సిన్ తదితర వ్యాక్సిన్లు కట్టడి చేయగలవా లేదా? అనేది ఇంకా తెలియవలసి ఉంది. 


Related Post