అమిత్ షా లెక్కలు తప్పుతాయి: ప్రశాంత్ కిషోర్

December 21, 2020


img

వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. గత ఎన్నికలలో మమతా బెనర్జీ చేతిలో భంగపడిన బిజెపి ఈసారి ఎలాగైనా గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఆ ప్రయత్నాలలో భాగంగానే 10 మంది తృణమూల్ ఎమ్మెల్యేలను, ఒక ఎంపీని బిజెపిలోకి ఆకర్షించింది. త్వరలో ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు బిజెపిలో చేరబోతున్నారని, చివరికి తృణమూల్ కాంగ్రెస్‌లో ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మమతా బెనర్జీ ఒక్కరే మిగులుతారని బిజెపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇటీవల అమిత్ షా రాష్ట్రంలో పర్యటించినప్పుడు చాలా భారీ సంఖ్యలో ప్రజలు ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ, “రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకొంటున్నారని స్పష్టం అవుతోంది,” అని అన్నారు. 

ఈసారి తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేస్తున్న ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ బిజెపి లెక్కలు తప్పుతాయని, అమిత్ షా పగటి కలలు కంటున్నారని చెప్పడం విశేషం. ఈసారి కూడా శాసనసభలోని 294 స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్‌ కనీసం 200 స్థానాలు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో బిజెపికి బలం లేకపోయినా అనుకూల మీడియాతో అనుకూలంగా ప్రచారం చేయించుకొంటూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని పగటి కలలు కంటోందని ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు. బిజెపి వాపును చూసి బలుపు అనుకొంటోందని, ఇప్పుడున్న మూడు స్థానాల కంటే ఏ మాత్రం ఎక్కువ వచ్చినా తాను తప్పుకొంటానని బిజెపికి సవాలు విసిరారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు వరుసగా బిజెపిలోకి వెళ్ళిపోతుండటంతో ఢీలాపడిన సీఎం మమతా బెనర్జీకి ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఈ మాటలు చాలా ఊరటనిస్తాయి.   



Related Post