తెలంగాణకు రూ.2,508 కోట్లు మంజూరు! నిధులు కావు...అప్పులు

December 21, 2020


img

ఏపీ, తెలంగాణలతో సహా మరో మూడు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం రూ.16,278 కోట్లు మంజూరు చేసింది. వాటిలో ఏపీకి రూ.2,525 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.2,508 కోట్లు మంజూరు చేసింది. అయితే నిధులు కావు...ఆ మేరకు బహిరంగం మార్కెట్ల నుంచి అప్పులు చేసుకోవడానికి అనుమతులు!

కేంద్రప్రభుత్వం సూచించినవిధంగా సులభతర వాణిజ్యంలో సంస్కరణలను అదేవిదంగా ‘వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్’ విధానం అమలుచేసినందుకు బహుమతిగా ఈ అప్పులు చేసుకొనేందుకు అనుమతించింది. ఈవిదంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ ఐదురాష్ట్రాలు కలిపి బహిరంగం మార్కెట్ల నుంచి మొత్తం రూ.16,278 కోట్లు అప్పులు చేసుకోవడానికి అనుమతించినట్లు కేంద్ర ఆర్ధికశాఖ తెలియజేసింది. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రాలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టం పోయినందున, ఆ లోటును పూడ్చుకొనేందుకుగాను ఎఫ్ఆర్‌బీఎం చట్ట ప్రకారం బహిరంగం మార్కెట్ల నుంచి రుణాలు సేకరించుకొనేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. 

కేంద్రం సూచించిన మరో నాలుగు రకాల సంస్కరణలను 2021, ఫిబ్రవరి 15లోగా అమలుచేసిన రాష్ట్రాలకు ఈ రుణపరిమితిని మరో 1 శాతం పెంచేందుకు కేంద్రప్రభుత్వం అంగీకరించింది. అంటే మరో రూ.2-3,000 కోట్లు అప్పులు తెచ్చుకొనే వెసులుబాటు కల్పిస్తుందన్నమాట!

కరోనా...లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాలకు తీవ్ర ఆర్ధికలోటు ఏర్పడిన మాట వాస్తవమే. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గిపోయిందంటూ ఉద్యోగుల జీతాలలో కోతలు విధించిన ప్రభుత్వాలు, ఎన్నికలలో పోటీపడి ఏవిధంగా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతుంటాయో అందరూ చూస్తూనే ఉన్నారు. అంటే ప్రభుత్వాలు పేదవి కానీ...వాటిని నడిపించే పార్టీలు కావని అర్ధమవుతోంది. రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలిచేందుకు ఏదో ఓ పేరుతో కొత్త పధకం ప్రకటించి ఎన్నికలలో గెలిస్తే ఆ భారం అవే మోయాలి కానీ ప్రజలు ఎందుకు మోయాలి? అయినా అయినా అప్పులు చేసి సంక్షేమ పధకాలు...సంబురాలు జరుపుకోవడం ఎందుకు?ఇంత విచ్చలవిడిగా ప్రజాధనం ఖర్చు చేయకుండా పొదుపు పాటిస్తే, ఈవిధంగా అప్పులు చేయవలసిన అవసరం ఉండేది కాదు కదా?

ప్రజాధనానికి ధర్మకర్తలలా వ్యవహరించవలసిన ప్రభుత్వాలు...వాటిని నడిపించే అధికార పార్టీలు ఆర్ధిక క్రమశిక్షణ పాటించకుండా విచ్చలవిడిగా అందినకాడికి అప్పులు చేస్తూ...ఖర్చు చేయడం...వాటిని సరైన బాటలో నడిపించవలసిన కేంద్రం కూడా వాటికే ఈవిధంగా సహకరిస్తుండటం చాలా బాధాకరం.


Related Post