సోమవారం నుంచి మళ్ళీ పాతపద్దతిలోనే రిజిస్ట్రేషన్లు

December 19, 2020


img

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతుండటం, స్లాట్ బుకింగ్ నిలిపి వేయమని ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం అయోమయంలో పడింది. ఇవాళ ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ అధికారులతో ఈ సమస్యలపై చర్చించి హైకోర్టు ఆదేశాల మేరకు స్లాట్ బుకింగ్స్ నిలిపివేసి సోమవారం నుంచి మళ్ళీ పాత పద్దతిలోనే...అంటే ‘కార్డ్ విధానం’లోనే రిజిస్ట్రేషన్లు జరిపించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే స్లాట్ బుకింగ్స్ చేసుకొన్నవారికి కేటాయించిన సమయం ప్రకారం రిజిస్ట్రేషన్లు జరిపించాలని నిర్ణయించారు. 

ధరణీ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు స్టే విధించినప్పటికీ కార్డ్ పద్దతిలో రిజిస్ట్రేషన్లు చేసుకొనేందుకు హైకోర్టు అనుమతించింది. దాంతో డిసెంబర్ 14నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 599 స్లాట్ బుకింగ్స్, 1,760 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కానీ వాటి కోసం రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో అమ్మకం, కొనుగోలుదారుల వ్యక్తిగత వివరాలను కోరుతుండటంతో హైకోర్టు మళ్ళీ జోక్యం చేసుకొని ఆ వివరాలను సేకరించకూడదని, వెబ్‌సైట్‌ సాఫ్ట్‌వేర్‌లో ఆ కాలమ్స్ తొలగించేవరకు రిజిస్ట్రేషన్లు చేపట్టరాదని ఆదేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా మళ్ళీ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. 

ధరణీ పోర్టల్‌ ప్రవేశపెట్టిన తరువాత ప్రయోగాత్మకంగా వరుసగా మూడు నాలుగు రోజులు దానిద్వారా రిజిస్ట్రేషన్లు చేసినప్పుడు ఎటువంటి సమస్యలు తలెత్తలేదు. దాంతో చాలా వేగంగా పారదర్శకంగా, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. 

కొత్త రెవెన్యూ చట్టంలో ధరణీకి చట్టబద్దత కల్పించకపోవడం, వ్యవసాయేతర ఆస్తుల విషయంలో ఇటువంటి న్యాయపరమైన సమస్యలను ముందుగా గుర్తించలేకపోవడం వలననే రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు పదేపదే అవరోధాలు ఏర్పడుతున్నాయని చెప్పవచ్చు. పాత కార్డ్ విధానాన్ని యధాతధంగా కొనసాగిస్తూ ధరణీకి సంబందించి ఇటువంటి చట్టపరమైన, న్యాయపరమైన సమస్యలు పరిష్కరించుకొని ఉంటే ఇన్ని సమస్యలు వచ్చి ఉండేవి కావు. 

సోమవారం నుంచి మళ్ళీ పూర్తిగా పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి కనుక ఇకపై రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు రిజిస్ట్రేషన్లు వేగం పుంజుకోవచ్చు. 


Related Post