టిఆర్ఎస్‌తో కుస్తీయే పక్కా: బిజెపి

December 19, 2020


img

టిఆర్ఎస్‌-మజ్లీస్‌ పార్టీల మద్య సన్నిహిత సంబంధాలున్నాయని అందరికీ తెలుసు. కానీ టిఆర్ఎస్‌-బిజెపిల మద్య ఎటువంటి సంబందాలున్నాయో నేటికీ ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. రాష్ట్ర స్థాయిలో ఆ రెండు పార్టీలు పోరాడుకొంటున్నప్పటికీ సిఎం కేసీఆర్‌-ప్రధాని నరేంద్రమోడీ-కేంద్రమంత్రుల మద్య మంచి సఖ్యత కొనసాగుతుండటమే అందుకు కారణం. దీనివలన టిఆర్ఎస్‌కు పెద్దగా నష్టం లేదు కానీ బిజెపి విశ్వసనీయత దెబ్బతింటోంది. 

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌-బిజెపిల మద్య ఆధిపత్యపోరు జరుగుతోందని స్పష్టమైనప్పటికీ, ఎన్నికలవగానే సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీని అభినందిస్తూ లేఖ వ్రాయడం, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలతో సహా పలువురు కేంద్రమంత్రులతో సిఎం కేసీఆర్‌ భేటీఅయినప్పుడు వారు ఆయనను ప్రశంసించడం వంటివి టిఆర్ఎస్‌-బిజెపిల మద్య సత్సంబందాలున్నాయనే భావన కలిగించడం సహజం. 

కానీ టిఆర్ఎస్‌తో తమకు దోస్తీ లేదని కుస్తీకే మొగ్గుచూపుతున్నామని బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చగ్ అన్నారు. ఆయన నిన్న హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు కేవలం ట్రెయిలర్ మాత్రమే చూపించాము. ఇంకా అసలైన సినిమా చూపించలేదు. వచ్చే శాసనసభ ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాము. కనుక టిఆర్ఎస్‌తో దోస్తీ లేదు పక్కా కుస్తీయే. ఇందులో ఎటువంటి సందేహమూ అవసరం లేదు. 

రాష్ట్రంలో టిఆర్ఎస్‌-మజ్లీస్‌ పార్టీల మద్య జరుగుతున్నది మాత్రం డూప్ ఫైటే. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికే రెండు పార్టీలు ఈ కొత్త నాటకం ఆడాయి. ఒకవేళ వాటి మద్య ఎటువంటి సంబందమూ లేకపోతే హడావుడిగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించిన సిఎం కేసీఆర్‌ ఇన్ని రోజులవుతున్నా  జీహెచ్‌ఎంసీ మేయర్ పదవికి ఎందుకు ఎన్నిక ప్రక్రియను చేపట్టలేదు?

టిఆర్ఎస్‌కు ఆత్మబందువు వంటి మజ్లీస్ అండదండలతో రాష్ట్రంలో తండ్రీ, కొడుకు, కూతురు,మేనళ్ళుల అవిభాజ్య హిందూ కుటుంబపాలన సాగుతోంది. అందరూ కలిసి ప్రజాధనం లూటీ చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. మనకి రాజాసాబ్ కుమారుడో... లేదా నయా నిజాం సాబ్ చెంచాలో అక్కరలేదు. బిజెపి అధికారంలోకి వస్తే సామాన్యుడే ముఖ్యమంత్రి అవుతారు. ప్రజల రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ పారదర్శకమైన పాలన అందిస్తాము,” అని అన్నారు. 


Related Post