జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ దురాశకు ప్రభుత్వం అడ్డుకట్ట

December 19, 2020


img

అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా త్వరలో పదవీకాలం ముగియనున్న జీహెచ్‌ఎంసీ కార్పోరేటర్లకు రూ.32 లక్షలతో ఐఫోన్లు కొని బహుమతిగా ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ తీర్మానం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం కలుగజేసుకొని అడ్డుకట్ట వేసింది. 

మేయర్, డెప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీలో 15 మంది సభ్యులు, ముగ్గురు అధికారులకు కలిపి మొత్తం 20 మందికి ఒక్కోటి రూ.1.60 లక్షలు ఖరీదు చేసే12 ప్రోమాక్స్‌ మోడల్‌ యాపిల్ ఐఫోన్లు బహుమతులుగా అందజేయాలని స్టాండింగ్ కమిటీ తీర్మానించింది. దానికోసం జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లో రూ.32 లక్షలు కేటాయించాలని నిర్ణయించింది. ఏటా స్టాండింగ్ కమిటీ సభ్యులకు ల్యాప్ టాపులు, ట్యాబ్‌లు బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీ కనుక ఈసారి యాపిల్ ఐఫోన్లు బహుమతులుగా అందజేయాలని స్టాండింగ్ కమిటీ తీర్మానించింది. గతంలో ఇదేవిధంగా ప్రజాధనంతో బహుమతులు కొనుగోలుచేసి పంచుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టు పిటిషన్‌ దాఖలయ్యాయి. అప్పుడూ జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవలసి వచ్చింది. అయినా అదంతా మరిచిపోయినట్లు మళ్ళీ యాపిల్ ఐఫోన్లు బహుమతులుగా అందజేయాలనుకోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కనుక స్టాండింగ్ కమిటీ తీసుకొన్న ఈ నిర్ణయాన్ని నిలిపివేయాలని మునిసిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ను ఆదేశించడమే కాక ట్విట్టర్‌ ద్వారా కూడా తెలియజేశారు.


Related Post