 
                                        కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో వేలాదిమంది రైతులు గత మూడు వారాలుగా ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం వారితో జరిపిన చర్చలు విఫలమవడంతో వారి ఆందోళనలు నానాటికీ ఉదృతం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు కేంద్రమంతృలే మాట్లాడారు. తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ కూడా మాట్లాడారు. శుక్రవారం మధ్యప్రదేశ్ రైతులతో వర్చువల్ విధానంలో సమావేశమైనప్పుడు ప్రధాని నరేంద్రమోడీ రైతులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మీకు వ్యవసాయ చట్టలపై ఏమైనా ఆనుమానాలు, ఆందోళన ఉన్నట్లయితే... చర్చలకు రండి...కూర్చొని మాట్లాడుకొందాము. మీకు శిరస్సు వంచి రెండు చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను. 
వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి తెచ్చినవి కావు. రైతుల సమస్యలపై సుమారు రెండు దశాబ్ధాలుగా గత ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయరంగ నిపుణులతో, రైతు ప్రతినిధులతో చర్చిస్తూనే ఉన్నాయి. కానీ రైతుల సమస్యలు పరిష్కరించేందుకు గత ప్రభుత్వాలు చొరవ తీసుకోలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాస్విత పరిష్కారం కోసం కొత్త వ్యవసాయచట్టాలను రూపొందించి అమలుచేస్తే, సహించలేక రైతులను రెచ్చగొట్టి ఆందోళనలకు పురికొల్పుతున్నాయి. మేము చేయలేని పనిని మోడీ చేశారనే అక్కసు...ఆ క్రెడిట్ మాకు దక్కుతుందనే అసూయతోనే వెనకుండి ఇదంతా చేయిస్తున్నారు. కావాలంటే ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. కానీ రైతులను తప్పు ద్రోవ పట్టించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. రైతుల భుజాలపై తుపాకీ ఉంచి మాపై కాల్పులు జరపాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. మేము ఈ చట్టాలు చేసి సుమారు ఆరు నెలలైంది. ఆ తరువాత రైతులు యధాప్రకారం స్థానిక వ్యవసాయ మార్కెట్లలో తమ పంటలను అమ్ముకొన్నారు. కనుక కొత్త వ్యవసాయ చట్టాల వలన రైతులకు ఎటువంటి నష్టం లేదని స్పష్టమైంది. దేశంలో పంటలకు మద్దతుధర ప్రకటించే విధానం ఎప్పటి నుంచో ఉంది. బుద్ది ఉన్నవారెవరూ దానిని రద్దు చేయరు. అది ఎప్పటికీ అలాగే కొనసాగుతుందని నేను హామీ ఇస్తున్నాను. కనుక రైతులు మాపై అనుమానాలు...అపోహలు వీడండి...చర్చలలో పాల్గొని మీ అభిప్రాయాలను, సలహాలు, సూచలను తెలియజేయండి. ప్రభుత్వం మీ ప్రయోజనాలను దెబ్బ తీసే ఏ చర్యను తీసుకోలేదు...ఇకపై తీసుకోబోము కూడా,” అని అన్నారు.