 
                                        ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం డెయిలీ సీరియల్‌లాగ నెలల తరబడి సాగుతుండటం విశేషం. స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆయన ఆ పదవిలో ఉండగా ఎట్టి పరిస్థితులలో ఎన్నికలు నిర్వహించకూడదని జగన్ ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉండటంతో ఈ వ్యవహారంపై పదేపదే న్యాయస్థానం కూడా జోక్యం చేసుకోవలసి వస్తోంది. ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డకు సహకరించాల్సిందిగా హైకోర్టు సూచించినప్పటికీ జగన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇవాళ్ళ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఒక రాజ్యాంగబద్దమైన రాష్ట్ర ఎన్నికల సంఘానికి కమీషనర్ హోదాలో తాను స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు వ్రాస్తే పట్టించుకోవడం లేదని, ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకొనేందుకు కుంటిసాకులు చెపుతున్నారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోనందుకు కోర్టు ధిక్కార నేరంగా పరిగణించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ ద్వారా హైకోర్టును కోరారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబునాయుడు కనుసన్నలలో పనిచేస్తున్నారని వైసీపీ వాదన. కనుక చంద్రబాబు ఒత్తిడి మేరకే ఎన్నికలు నిర్వహించి టిడిపికి రాజకీయ లబ్ది చేకూర్చాలని ప్రయత్నిస్తోందని వాదిస్తోంది. రాజ్యాంగవ్యవస్థలో భాగంగా ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఈవిధంగా పక్షపాతధోరణితో వ్యవహరిస్తుండటం సరికాదని వైసీపీ వాదిస్తోంది. కానీ కోర్టులో ఇటువంటి ఆరోపణలు చేసి ఒప్పించలేదు కనుక రాష్ట్రంలో అధికారులు, సిబ్బంది చాలామంది కరోనా కట్టడిలో తీరిక లేకుండా ఉన్నారని, కనుక ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించలేమని జగన్ ప్రభుత్వం తెగేసి చెపుతోంది. అందుకే ఈ పంచాయతీ మళ్ళీ హైకోర్టుకు చేరిందిపుడు. మరి హైకోర్టు ఏమి చెపుతుందో చూడాలి.