భూవినియోగ మార్పిడికి తహసీల్దారులకు అధికారాలు

December 17, 2020


img

ధరణీ పోర్టల్‌ అందుబాటులోకి వచ్చి అప్పుడే నెలరోజులు కావస్తున్నప్పటికీ ఇంకా బాలారిష్టాలు తప్పడం లేదు. ధరణీలో మొదట వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో న్యాయవివాదాలు తలెత్తగా ఇప్పుడు వ్యవసాయభూములను వ్యవసాయేతర భూములుగా బదిలీ చేయడంలోను సమస్యలు ఎదురవుతున్నాయి. దాంతో తెలంగాణ ప్రభుత్వం భూవినియోగ మార్పిడికి తహసీల్దారులకు అధికారం అప్పజెప్పాలని నిర్ణయించింది. గ్రామాలలోనే తహసీల్దారులే భూవినియోగ మార్పిడికి అనుమతిస్తూ ధరణీలో అప్‌డేట్ చేసినట్లయితే కొనుగోలు, అమ్మకందారులు ఆర్‌డీవో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసిన అవసరం ఉండదు. 

వ్యవసాయభూములను వ్యవసాయేతర భూములుగా బదిలీ చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు కూడా నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని భూములకైతే బేసిక్ విలువలో 2 శాతం, అదే ఇతర ప్రాంతాలలోనైతే 3 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బుదవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయభూములను వ్యవసాయేతర భూములుగా బదిలీ ప్రక్రియ కూడా మొదలవుతుందని ప్రభుత్వం పేర్కొంది. 

అయితే ధరణీ పోర్టల్‌ ప్రవేశపెట్టక మునుపు జరిగిన వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్లలో సుమారు 2 లక్షలుపైగా మ్యూటేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. వాటి కోసం కొనుగోలుదారులు,అమ్మకందారులు ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు...ఎంఆర్ఓ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే ముందు ధరణీ పోర్టల్‌ గాడిన పడితే కానీ పాత రిజిస్ట్రేషన్లకు సంబందించి ఇటువంటి సమస్యలు పరిష్కారం అయ్యేలా లేవు.


Related Post