కోటికి చేరువలో దేశంలో కరోనా కేసులు

December 17, 2020


img

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి దేశంలో కరోనా కేసులు నమోదవడం ప్రారంభించాయి. అప్పటి నుంచి జూలై-ఆగస్ట్ నెలల వరకు శరవేగంగా పెరుగుతూవచ్చాయి. అయితే దేశవ్యాప్తంగా సుమారు మూడు నెలలు లాక్‌డౌన్‌ విధించి కరోనా కట్టడికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అనేకానేక చర్యలు చేపట్టడంతో దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇంతకు ముందు దేశంలో రోజుకు 40-50,000 కొత్త కేసులు నమోదవుతుండేవి కానీ ఇప్పుడు ఆ సంఖ్య రోజుకు 24,000కు తగ్గింది. అలాగే ఒకప్పుడు దేశంలో రోజుకు 3,000కు పైగా కరోనా బారినపడి చనిపోతుండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 3-400కు తగ్గింది. నేటికీ దేశంలో కొత్త కేసులు నమోదవుతున్నప్పటికీ కొలుకొంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంటుండటం చాలా ఊరట కలిగించే విషయమే. 

135 కోట్లుకు పైగా జనాభా ఉన్న మన దేశంలో సగానికి పైగా నిరుపేదలే ఉన్నారు కనుక దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశిస్తే ఎక్కడికక్కడ శవాల గుట్టలు పేరుకుపోతాయని అగ్రదేశాలు జోస్యం చెప్పాయి. కానీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, భారతీయులు అందరూ కలిసికట్టుగా పనిచేసి 10 నెలల్లోనే కరోనాను పూర్తిగా అదుపుచేసి చూపారు. తత్ఫలితంగా 10 నెలల తరువాత ఇప్పటికీ దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటికి చేరుకొంటోంది. 135 కోట్లుకు పైగా జనాభా ఉన్న మన దేశంలో కేవలం కోటి మంది మాత్రమే కరోనా బారినపడటం పెద్ద విషయం కాదనే చెప్పాలి. వారిలో ఇప్పటివరకు 98,89,740 మంది కోలుకొన్నారు కనుక ఇంచుమించు అందరూ కోలుకొన్నట్లే. 

ఇప్పటికే కరోనాను ఏవిధంగా నియంత్రించాలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకొని ఆ విధానాలను చాలా సమర్ధంగా అమలుచేస్తున్నాయి. అలాగే కరోనా చికిత్సకు ఇప్పుడు అనేకరకాల మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. అతి త్వరలోనే కరోనా సోకకుండా నివారించేందుకు వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. కనుక 2020లో కరోనాతో విలవిలలాడిన భారత్‌, 2021లో దానినుంచి పూర్తిగా విముక్తి పొంది మళ్ళీ అభివృద్ధిపదంలో దూసుకుపోవడం ఖాయం. మరో 4-5 నెలల్లోనే కరోనా భయాల నుంచి దేశప్రజలకు పూర్తిగా విముక్తి పొంది మళ్ళీ స్వేచ్ఛగా జీవిస్తూ నిర్భయంగా రోజువారీ పనులు చేసుకోగలుగుతారు.


Related Post