డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు అందరికీ ఇవ్వలేము

December 17, 2020


img

రాష్ట్రంలో ఎక్కడ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు ప్రారంభించినా ఆ కార్యక్రమంలో పాల్గొనే మంత్రులు, ప్రజాప్రతినిధులు తప్పక చెప్పే మాట ఒకటుంటుంది. రాష్ట్రంలో పేదలందరూ ఆత్మగౌరవంతో జీవించేందుకే సిఎం కేసీఆర్‌ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ పధకం ప్రవేశపెట్టారని, దేశంలో మరే రాష్ట్రంలో ఈవిధంగా పేదలకు ఉచితంగా ఇళ్ళు కట్టించి ఇవ్వడం లేదని చెపుతుంటారు. అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందుకు భిన్నంగా మాట్లాడటం విశేషం.

మహబూబ్‌నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు నిర్మిస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఉన్న లక్షలాదిమంది పేదప్రజలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కట్టించి ఇవ్వడం సాధ్యం కాదు. కనుక ప్రతీ సంవత్సరం లాటరీ విధానం ద్వారా లబ్దిదారులను ఎంపిక చేసి సిద్దమైన 3-4,000 ఇళ్ళను వారికి అందజేస్తున్నాము. దేవుడి దయ ఉండి మీ అదృష్టం బాగుంటే 10-15 ఏళ్ళలో ఎప్పుడో అప్పుడు మీకు తప్పకుండా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు లభిస్తుంది. కనుక దరఖాస్తు చేసిన తరువాత ఇళ్ళ కోసం తిరుగుతూ ఎదురుచూపులు చూడొద్దు. ఆర్ధిక స్తోమతు ఉన్నవారు స్వయంగా ఇళ్ళు కట్టుకొన్నట్లయితే, స్థోమతలేని వారు ఇళ్ళు నిర్మించుకొనేందుకు ప్రభుత్వం తప్పకుండా సహాయసహకారాలు అందజేస్తుంది,” అని అన్నారు. 

మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పిన్నట్లు ప్రభుత్వమే రాష్ట్రంలో అందరికీ ఇళ్ళు కట్టించి ఇవ్వడం సాధ్యం కాదు. అయితే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ పధకం ప్రకటించినప్పటి దాని గురించి నిత్యం బాకా ఊదుకొంటూ ‘అడ్వాన్స్ క్రెడిట్’ తీసుకొంటున్న టిఆర్ఎస్‌, ఇప్పుడు అందరికీ ఇళ్ళు కట్టించి ఇవ్వడం సాధ్యం కాదని చెపితే, భూటకపు హామీలతో టిఆర్ఎస్‌ ప్రజలను మోసం చేస్తోందనే ప్రతిపక్షాల వాదనలకు బలం చేకూర్చినట్లవుతుంది. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం కల్పించినట్లవుతుంది కదా?


Related Post