చెన్నమనేని పౌరసత్వం కేసుపై నేడు హైకోర్టు విచారణ

December 16, 2020


img

 వేములవాడ టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. ఆయన జర్మనీ పౌరసత్వం కలిగి ఉండగా ఆ విషయాన్ని దాచిపెట్టి భారత్‌ పౌరసత్వం పొందినందుకుగాను కేంద్రప్రభుత్వం నవంబర్‌ 2019లో ఆయన భారత్‌ పౌరసత్వాన్ని రద్దు చేసింది. దాంతో ఆయన కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. దానిపై నేడు విచారణ జరుగనుంది. 

జర్మన్ పౌరసత్వం కలిగిన చెన్నమనేని శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడం కూడా చట్టవిరుద్దమని కేంద్రప్రభుత్వం తరపున ఈ కేసును వాదిస్తున్న అటార్నీ జనరల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వానికి సంబందించిన పూర్తి వివరాలను తెలపాలని హైకోర్టు కేంద్ర హోంశాఖను ఇదివరకే ఆదేశించింది. కనుక నేడు కేంద్ర హోంశాఖ తరపున సమర్పించబోయే ఆ నివేదిక ఈ కేసు విచారణలో చాలా కీలకం కానుంది. 

ఈకేసులో ఇంప్లీడ్ పిటిషనర్‌ (కేసు విచారణలో పాల్గొంటున్న అదనపు పిటిషనర్) ఆది శ్రీనివాస్ తరపున వాదిస్తున్న న్యాయవాది మరికొన్ని కొత్త విషయాలు కోర్టు ముందు ఉంచబోతున్నారు. ఈ కేసు విచారణలో ఉండగా చెన్నమనేని రమేష్ తన జర్మనీ పాస్‌పోర్టుతో ఈ ఏడాది మార్చిలో జర్మనీకి వెళ్ళి ప్రస్తుతం అక్కడే ఉన్నారని, ఈవిషయం కూడా ఆయన కౌంటర్ అఫిడవిట్‌లో తెలియజేయకుండా దాచిపెట్టారని చెప్పారు. ఆ వివరాలను కూడా నేడు కోర్టుకు సమర్పించనున్నారు. కనుక చెన్నమనేని చేజేతులా చేసుకొన్న ఇటువంటి తప్పులకే ఆయన మూల్యం చెల్లించవలసి రావచ్చు. అదే జరిగితే ఆయన భారత్‌కు ఓ అతిధిగా మాత్రమే వచ్చి వెళుతుండగలరు తప్ప శాస్వితంగా ఉండలేదు. అంతేకాదు... ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకతప్పదు. అదే జరిగితే వేములవాడ శాసనసభ నియోజకవర్గానికి ఉపఎన్నికలు అనివార్యం అవుతాయి. మరి ఈ కేసు నుంచి ఆయన బయటపడటారో లేదో చూడాలి.


Related Post