రేవంత్‌, కోమటిరెడ్డి నేడు ఢిల్లీలో అమీతుమీ

December 16, 2020


img

తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ అమీతుమీ తేల్చుకొనేందుకు నేడు ఢిల్లీకి వెళుతున్నారు. ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీ, ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలను కలిసి పిసిసి అధ్యక్ష పదవి తమకే ఇవ్వాలని ఒప్పించే ప్రయత్నాలు చేయనున్నారు. 

అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సొంత పనుల మీద ఢిల్లీ వెళుతున్నట్లు చెపుతుండగా, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ (డిఫెన్స్)లో సభ్యుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి, ఆ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళుతున్నట్లు చెపుతున్నారు. 

పిసిసి అధ్యక్ష పదవిని ఆశిస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆ పదవి తనకు లభించకపోయినా పరవాలేదు కానీ రేవంత్‌ రెడ్డికి మాత్రం ఇవ్వకూడదని బహిరంగంగానే చెపుతున్నారు. అవసరమైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా తాను కూడా ఢిల్లీ వెళ్ళి సోనియా, రాహుల్ గాంధీలను కలిసి మాట్లాడుతానని అన్నారు. 

తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ఎప్పుడూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలకే ఇస్తున్నారని కనుక ఈసారి బీసీలకు ఇవ్వాలని పార్టీలో వి.హనుమంతరావు, మధుయాష్కీ వంటి బీసీ నేతలు కోరుతున్నప్పటికీ, ఎన్నికలలో టిఆర్ఎస్‌-బిజెపిల పోరులో కాంగ్రెస్‌ అడ్రస్ గల్లంతవుతున్నట్లుగానే తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి రేసులో రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల మద్య జరుగుతున్న పోటీలో బీసీ నేతలు వెనుకబడిపోయారు. కనుక తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి మళ్ళీ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారిరువురిలో ఎవరో ఒకరికి దక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.


Related Post