సాగర్ ఉపఎన్నికలు..మూడు పార్టీలకు మరో అగ్నిపరీక్ష

December 15, 2020


img

నాగార్జునసాగర్ టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంతో ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ ఎన్నికలు కూడా టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు వేర్వేరు కారణాలతో చాలా ప్రతిష్టాత్మకంకానున్నాయి. 

లోక్‌సభ, దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిజెపి చేతిలో అనూహ్యంగా ఎదురుదెబ్బలు తిన్న కారణంగా ఈ ఉపఎన్నికలు టిఆర్ఎస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమవుతాయి. ఈ ఉపఎన్నికలలో కూడా మళ్ళీ బిజెపిలో చేతిలో ఓడిపోతే సిఎం కేసీఆర్‌ పాలన పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోందని, రాష్ట్రంలో బిజెపి బలపడుతోందని రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా టిఆర్ఎస్‌ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయి. కనుక ఎట్టి పరిస్థితులలో ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ భారీ మెజార్టీతో గెలవవలసి ఉంటుంది. అప్పుడే పార్టీ శ్రేణులలో మళ్ళీ ఆత్మస్థైర్యం పెరుగుతుంది. దుబ్బాక, గ్రేటర్‌ పరాజయాలతో మసకబారిన సిఎం కేసీఆర్‌ ప్రతిష్ట మళ్ళీ పెరుగుతుంది. కనుక ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ సర్వశక్తులు ఒడ్డి పోరాడటం ఖాయం. 

 దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో దూసుకుపోయిన బిజెపికి ‘ఆ గెలుపు లాటరీ తగిలినట్లు వచ్చింది కాదు...రాష్ట్రంలో టిఆర్ఎస్‌ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, బిజెపికి అనుకూలవాతావరణం ఏర్పడిందని’ నిరూపించుకొనేందుకు ఈ ఉపఎన్నికలలో కూడా గెలుపు తప్పనిసరి. అప్పుడే రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బిజెపి ప్రజలలో, రాజకీయ వర్గాలలో గుర్తింపు పొందగలుగుతుంది. కనుక ఈ ఉపఎన్నికలను కూడా బిజెపి సవాలుగా తీసుకొని పోరాడటం ఖాయం. అందుకోసం ఈసారి బిజెపి ఎంతదూరమైనా వెళ్ళేందుకు సిద్దపడవచ్చు కూడా. 

ఇక వరుస అపజయాలు, పలువురు ముఖ్య నేతల ఫిరాయింపులు, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఢీలాపడిన కాంగ్రెస్‌ పార్టీ, ప్రస్తుతం పిసిసి అధ్యక్ష పదవి కోసం నేతల మద్య జరుగుతున్న కీచులాటలతో ఇంకా అప్రదిష్టపాలవుతోంది. ముఖ్యంగా ఇప్పుడు ఏ ఎన్నికలు జరుగుతున్నా పోరు టిఆర్ఎస్‌-బిజెపిల మద్య మారుతుండటంతో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండాపోతోంది. దానికి తోడు కాంగ్రెస్ అభ్యర్ధులకు ఓట్లు వేసి గెలిపించినా ఎన్నికలలో గెలిచిన తరువాత వారు టిఆర్ఎస్‌ లేదా బిజెపిలో చేరిపోతారనే అభిప్రాయం ప్రజలలో బలంగా నాటుకుపోయింది. పిసిసి అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు తమకు పిసిసి పగ్గాలు అప్పగిస్తే టిఆర్ఎస్‌, బిజెపిలను ఢీకొని పార్టీకి పూర్వవైభవం సాధిస్తామని బల్లగుద్ది చెపుతున్నారు. కనుక ఎవరికి పార్టీ పగ్గాలు లభించినా, ఈ రేసులో ఓడిపోయినవారి నుంచి వ్యతిరేకత లేదా సహాయనిరాకరణను ఎదుర్కొంటూనే టీఆర్ఎస్,బిజెపీలతో కూడా తలపడక తప్పదు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌ పగ్గాలు ఎవరు చేపట్టినా వారికి ఈ ఉపఎన్నికలు అగ్నిపరీక్షవంటివే. కనుక ఈ ఉపఎన్నికలలో ఎట్టిపరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని తమ సత్తా చాటుకోవలసి ఉంటుంది. లేకుంటే పిసిసి అధ్యక్షుడిని మార్చినా పార్టీ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదని స్పష్టమవుతుంది. దాంతో పార్టీలో మళ్ళీ ఫిరాయింపులు మొదలైపోతాయి. కనుక ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా సర్వశక్తులు ఒడ్డి పోరాడటం ఖాయం.  

ఈవిధంగా మూడు ప్రధానపార్టీలకు ఈ ఉపఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి కనుక సర్వశక్తులు ఒడ్డి  పోరాడబోతున్నాయి. కనుక జీహెచ్‌ఎంసీ ఎన్నికల కంటే ఈ ఉపఎన్నికలు చాలా భీకరంగా జరగడం తధ్యం. 


Related Post