 
                                        తెలంగాణ సిఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళివచ్చిన తరువాత నేడు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలను కలువబోతున్నారు. ఏపీకి సంబందించిన సమస్యలు, విభజన అంశాలు, పోలవరం ప్రాజెక్టుకు సంబందించిన అంశాలపై ఏపీ సిఎం జగన్ వారితో చర్చించేందుకు ఢిల్లీ వెళుతున్నారని సమాచారం. ఇది మీడియాలో చెప్పుకొనేందుకు ఇచ్చిన సమాచారంగా భావించవచ్చు. కానీ ఇంతకంటే ముఖ్యమైన కొన్ని కారణాలు కొన్ని కనిపిస్తున్నాయి. 
వాటిలో మొట్టమొదటిది తమ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా మారిన ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో తలనొప్పులు గురించి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలకు మొరపెట్టుకొనేందుకు కావచ్చు. ఈ ఏడాది మార్చిలో కరోనా విజృంభిస్తున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను కొనసాగించాలని పట్టుబట్టిన జగన్ ప్రభుత్వం, ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయినా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ సన్నాహాలు మొదలుపెట్టారు. కనుక నిమ్మగడ్డను వదిలించుకోవడం కోసమే ఏపీ సిఎం జగన్ ఢిల్లీకి వెళుతున్నట్లు భావించవచ్చు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాదిన్నర గడిచిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా హైకోర్టు అడ్డుకొంటుండటంతో రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించలేకపోయింది. ఇప్పుడు ఏపీ బిజెపి రాజధాని అమరావతిలోనే ఉండాలని కొత్త పల్లవి ఎత్తుకోవడం జగన్ ప్రభుత్వానికి ఆందోళన కలిగించే విషయమే.
హైకోర్టు అనేక కేసులలో ఏపీ ప్రభుత్వానికి పదేపదే మొట్టికాయలు వేస్తూ స్టే ఆర్డర్లు జారీ చేస్తూ అడుగుముందుకు వేయకుండా చేస్తోంది. దాంతో హైకోర్టు కూడా తమకు పక్కలో బల్లెంలా తయారైందని ఏపీ సీఎం జగన్ భావించడం సహజం. కనుక ఈ సమస్యపై కూడా ప్రధాని, హోంమంత్రికి మొరపెట్టుకోవడానికి ఏపీ సిఎం జగన్ ఢిల్లీ ప్రయాణం పెట్టుకొని ఉండవచ్చు.
వైసీపీ ప్రభుత్వం కూడా వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఇచ్చిన భారత్ బంద్‌లో పాల్గొన్నప్పటికీ ఈవిషయంలో కేంద్రానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి తన సమస్యలను పరిష్కరించవలసిందిగా ప్రధాని, హోంమంత్రిని కోరేందుకు కావచ్చు.
తెలంగాణలో బిజెపి స్పీడ్ పెంచి అపర చాణక్యుడు వంటి సిఎం కేసీఆర్‌ను ముప్పతిప్పలు పెడుతోంది. అది చూసి ఏపీ బిజెపి కూడా ఇటీవల స్పీడ్ పెంచి జగన్ ప్రభుత్వంపై సమరభేరి మ్రోగించింది. కనుక ఏపీ బిజెపితో సమస్యలు లేకుండా చూసుకొనేందుకు జగన్ ఢిల్లీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది. మరి జగన్ ఢిల్లీ పర్యటన ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.