కమల్‌తో దోస్తీకి మజ్లీస్ సై

December 15, 2020


img

ఇప్పటికే మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాలలో అడుగుపెట్టిన మజ్లీస్ పార్టీ ఇకపై దేశంలో అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని కృతనిశ్చయంతో ఉంది. ఆ ప్రయత్నాలలో భాగంగానే వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో జరుగబోయే తమిళనాడు  శాసనసభ ఎన్నికలలో కూడా పోటీ చేయాలని నిర్ణయించింది. దీని కోసం సెక్యులర్ విధానాలతో ముందుకు సాగుతున్న కమల్ హాసన్‌ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని భావిస్తోంది. తమిళనాడులో రామనాథపురం, తిరుచ్చి, తిరునల్వేలీ, తిరుపత్తూర్, మధురై, కృష్ణగిరి, వెల్లోర్, రాణిపేట్, పుదుకొట్టాయ్ తదితర ప్రాంతాలలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. ఒకవేళ కమల్ హాసన్‌ తమతో పొత్తులకు అంగీకరిస్తే ఆ ప్రాంతాలలో 25 స్థానాలలో మజ్లీస్ పార్టీ పోటీ చేయాలని భావిస్తోంది. ముందుగా కమల్ హాసన్‌తో తమ స్థానిక ప్రతినిధుల ద్వారా సంప్రదింపులు జరిపి ఆయన సానుకూలంగా స్పందిస్తే అసదుద్దీన్ ఓవైసీ చెన్నై వెళ్ళి ఆయనతో భేటీ అయ్యి మజ్లీస్-ఎంఎన్ఎం మద్య పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చించాలని భావిస్తున్నారు. 

వచ్చే ఏడాది మే-జూన్‌ నెలల్లో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ రాష్ట్రంలో కూడా 27 శాతం ముస్లిం జనాభా ఉన్నందున 30 స్థానాలలో పోటీ చేయాలని మజ్లీస్ భావిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంగీకరిస్తే అధికార తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలనుకొంటున్నామని అసదుద్దీన్ ఓవైసీ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కానీ ఆమె స్పందించకపోవడంతో మజ్లీస్ ఒంటరి పోరాటానికి సిద్దమవుతోంది. మొన్న శనివారం అసదుద్దీన్ ఓవైసీ కోల్‌కతా వెళ్ళి అక్కడ తమ పార్టీ నేతలతో ఎన్నికలలో పోటీ గురించి లోతుగా చర్చించారు. ఎన్నికలలోగా మరికొన్ని సార్లు సమావేశమయ్యి తదుపరి కార్యాచరణను రూపొందించుకోవాలని నిర్ణయించారు. కనుక 2021లో మజ్లీస్ పార్టీ తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు విస్తరించడం ఖాయంగానే కనిపిస్తోంది.


Related Post