 
                                        సిఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులను కలిసి హైదరాబాద్ తిరిగివచ్చేయగానే బిజెపి అధిష్టానం   బండి సంజయ్‌ను వెంటనే ఢిల్లీకి రమ్మని పిలవడంతో టిఆర్ఎస్-బిజెపిల మద్య సంధి కుదిరిందా?అని ప్రజలలో, సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ బండి సంజయ్ ఇవాళ్ళ ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన మాటలు విన్నప్పుడు టిఆర్ఎస్‌తో సమరానికే బిజెపి అధిష్టానం సిద్దమైందని స్పష్టమైంది.
బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, “ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకొంటున్న సిఎం కేసీఆర్‌పై కేసులు నమోదుచేస్తామని మేము హెచ్చరించగానే హడావుడిగా ఢిల్లీకి వచ్చి వంగివంగి దండాలు పెట్టి వెళ్ళారు. కానీ ఆయన పొర్లు దండాలు పెట్టినా మేము క్షమించే ప్రసక్తి లేదు. సమయం వచ్చినప్పుడు ఆయన అవినీతిపై విచారణ జరిపించి తప్పకుండా జైలుకు పంపిస్తాం. ఇది నూటికి నూరు శాతం పక్కా.
కేసీఆర్ గొంతెమ్మ కోరికలకు కేంద్రం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటారు. ఇవ్వకపోతే కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందంటూ కేంద్రప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుంటారు. ప్రాజెక్టుల పేరిట సిఎం కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు ప్రజాధనం దోచుకొని పోగేసుకొంటునందునే కాళేశ్వరం ప్రాజెక్టు 3వ టీఎంసీకి డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ఇస్తే తప్ప ఇటువంటి అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకోలేమని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఇకపై మిగిలినవాటికీ డీపీఆర్ ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్ ఓడిపోవడంతో ప్రజల దృష్టిని మళ్ళించేందుకే భారత్ బంద్‌కు మద్దతు ఇచ్చారు. అక్కడ బంద్ చేయించిన సిఎం కేసీఆర్ మరి ఢిల్లీ వచ్చినప్పుడు ఇక్కడ ఆందోళన చేస్తున్న రైతుల దగ్గరకు ఎందుకు పోలేదు? సిఎం కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరినప్పుడే ఆయన మళ్ళీ ప్రజల దృష్టి మళ్లించడానికే బయలుదేరారని చెప్పాను. ఇక్కడ లోపల మాట్లాడింది... జరిగింది ఒకటి. బయటకు చెప్పేది మరోటి. అందుకే నేను ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి అన్ని విషయాలు వివరిస్తున్నాను. అసలు సిఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వచ్చారు? ఏమి సాధించారు?అనే విషయాలపై సోషల్ మీడియాలో, ప్రజలలో, చివరికి టిఆర్ఎస్ పార్టీలోనే చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనుక సిఎం కేసీఆర్ స్వయంగా తన ఢిల్లీ పర్యటనపై వివరణ ఇవ్వాలి,” అని అన్నారు.