కమల్ హాసన్, రజినీకాంత్ అనేక సినిమాలలో కలిసి నటించారు. ఆ తరువాత వేర్వేరుగా అనేక సినిమాలతో పోటీపడ్డారు కూడా. అందుకే తమిళనాడులో వారిద్దరికీ లక్షలాదిమంది అభిమానులున్నారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు మళ్ళీ రాజకీయాలలో కూడా పోటీ పడబోతున్నారు. 
కమల్ హాసన్ ఇప్పటికే ‘మక్కల్ నీది మయ్యుమ్’ అనే పేరుతో పార్టీ స్థాపించి లోక్‌సభ ఎన్నికలలో కూడా పోటీచేయించారు కూడా. కానీ ఆ ఎన్నికలలో ఆయన పార్టీ ఓడిపోయింది. వచ్చే ఏడాది జరుగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించడమే కాక తాను కూడా పోటీ చేస్తానని కమల్ హాసన్ ఇవాళ్లే మధురైలో ప్రకటించారు. కమల్ హాసన్ ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు కనుక తన పార్టీని బలోపేతం చేసుకొని రాబోయే ఎన్నికలలో గెలిపించుకోవడానికి అప్పుడే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు కూడా.
రాజకీయాలలోకి వస్తానని చాలా ఏళ్ళుగా చెపుతున్న రజినీకాంత్ కూడా డిసెంబర్ 31వ తేదీన పార్టీ వివరాలు ప్రకటిస్తానని అభిమానులకు చెప్పారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ కూడా పోటీ చేస్తుందని కనుక అందరూ సిద్దంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేసారు. తమిళనాడు పరిస్థితి ఏమీ బాగోలేదని కనుక మార్పు అవసరమని అది తన ద్వారానే సాధ్యమని చెప్పడం ద్వారా రజినీకాంత్ కూడా ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారని అర్దమవుతోంది.
రజినీ రాజకీయాలలో ప్రవేశిస్తే ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్దమని ప్రకటించారు కానీ కమల్ హాసన్ ప్రతిపాదనపై రజినీకాంత్ స్పందించలేదు. అంటే ఇద్దరూ కలిసి పనిచేయబోరని స్పష్టం అయ్యింది. కనుక రజినీ, కమల్ ఇద్దరి మద్య మళ్ళీ పోటీ తప్పదని స్పష్టమైంది.
ఈ రెండు పార్టీలే కాక దశాబ్ధాలుగా తమిళనాడులో పాతుకుపోయిన డీఎంకే, అన్నాడీఎంకేలున్నాయి. వాటి వెనుక కాంగ్రెస్, బిజెపిలున్నాయి. ఏదోవిధంగా తమిళనాడులో పాగా వేయాలని అవి కూడా విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవే కాక మరో అరడజనుకు పైగా చిన్న చితకాపార్టీలు, సినీ నటులు కూడా ఉన్నారు. తమిళరాజకీయాలలో అత్యంత శక్తివంతురాలిగా పేరున్న శశికళ కూడ త్వరలోనే జైలు నుంచి బయటకు వచ్చి చక్రం తిప్పేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు.
కనుక వచ్చే శాసనసభ ఎన్నికలలో వీటన్నిటి మద్య కురుక్షేత్ర మహాసంగ్రామమే జరుగబోతోందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు తమిళనాడులో రాజకీయ శూన్యత ఉందనుకొంటే, వచ్చే ఎన్నికలనాటికి కుప్పలు తెప్పలుగా పార్టీలు, నేతలు, నటీనటులు, జైలు పక్షులతో తమిళనాడు రాజకీయాలు కళకళలాడిపోబోతున్నాయి. కనుక ఈసారి తమిళనాడు ప్రజలకు వారిలో నుంచి ఒకరిని ఎంపిక చేసుకోవడం అగ్నిపరీక్షగా మారనుంది.