9.jpg) 
                                        ప్రస్తుతం పిసిసి అధ్యక్ష పదవి కోసం పార్టీలో నేతలు కుమ్ములాడుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ పదవి కోసం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేసుకొంటుండగా, ఆయనకు ఇస్తే ఊరుకోమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి హెచ్చరిస్తున్నారు. ఆ పదవిని ఆశిస్తున్న వి.హనుమంతరావు కూడా రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
ఈ నేపధ్యంలో ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికే ఆ పదవి కట్టబెడితే పార్టీలో ఆయనను వ్యతిరేకిస్తున్న ఈ సీనియర్ నేతలందరూ ఆయనకు సహాయనిరాకరణ చేయడం తధ్యం. వారి సహకారం లేకుండా రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని నడిపించలేరని చెప్పవచ్చు. అలాగని వారిని బుజ్జగించి లేదా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని దారికి తెచ్చుకోవడం కూడా కష్టమే. రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి కట్టబెడితే ఆయనను వ్యతిరేకిస్తున్న సీనియర్లలో కొందరైనా పార్టీని వీడివెళ్ళిపోవచ్చు కూడా. మరి ఇవన్నీ రేవంత్ రెడ్డికి తెలియవనుకోలేము. అయినా పిసిసి అధ్యక్ష పదవి కోసం ఆయన ప్రయత్నాలు చేస్తుండటం ఆశ్చర్యకరమే.
ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేదా మరో సీనియర్ నేతకు ఈ పదవిని కట్టబెడితే అప్పుడు రేవంత్ రెడ్డికి సహజంగానే పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుంది కనుక అప్పుడు ఆయనేమి చేస్తారో చూడాలి.
ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి అప్పగించినప్పటికీ, దానిని ముందుకు నడిపించడం చాలా కష్టమే. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ఒక్క టిఆర్ఎస్‌తోనే పోరాడవలసివచ్చేది. కానీ ఇప్పుడు బిజెపితో కూడా పోరాడవలసి వస్తోంది. టిఆర్ఎస్-బిజెపిల పోరులో కనబడకుండాపోతున్న కారణంగా కాంగ్రెస్ నేతలే పార్టీపై నమ్మకం కోల్పోయి బిజెపిలోకి వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ అయోమయస్థితిని చూసి ప్రజలు కూడా దానిని పక్కన పెడుతున్నారు. కనుక పార్టీ నేతలు, శ్రేణులలో, ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకం కలిగించడం కూడా చాలా కష్టమే. ఇటువంటి పరిస్థితులలో కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీలుపడుతూ కీచులాడుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ పదవి చేపట్టడం తమ జీవితాశయం...చాలా గొప్పవిషయం కనుకనే సీనియర్ నేతలు దాని కోసం పోటీ పడుతున్నారా లేదా ఆ పదవి చేపట్టి పార్టీని ఉద్దరించగలమని వారు అనుకొంటున్నారో తెలీదు!