 
                                        కేంద్రప్రభుత్వం తెచ్చిన వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తూ గత రెండు వారాలుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులు ఈ నెల 8న భారత్ బంద్‌కు పిలుపునిస్తే సిఎం కేసీఆర్ దానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సహా టిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా బంద్‌లో పాల్గొని విజయవంతం చేశారు. బంద్ సందర్భంగా కొత్త వ్యవసాయచట్టాల వలన దేశంలో రైతులు తీవ్రంగా నష్టపోతారంటూ సిఎం కేసీఆర్‌తో సహా అందరూ గట్టిగా వాదించారు. కనుక సిఎం కేసీఆర్ ఇటీవల ఢిల్లీ పర్యటించినప్పుడు అక్కడ ఆందోళన చేస్తున్న రైతుసంఘాల నేతలను లేదా వారికి మద్దతు పలుకుతున్న ప్రతిపక్ష నేతలను కలిసి వారి పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తారనుకోవడం సహజమే. 
కానీ సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రహోంమంత్రి అమిత్ షా తదితర కేంద్రమంత్రులతో భేటీ అయ్యి రైతుసంఘాల నేతలను కలవకుండానే హైదరాబాద్ తిరిగివచ్చేశారు. రైతుసంఘాలకు-కేంద్రప్రభుత్వానికి మద్య జరిగిన చర్చలు విఫలమవడంతో రైతుసంఘాల నేతలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో రైతులు ఆందోళనలు చేసి కేంద్రానికి నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. వారి బంద్‌కు మద్దతు పలికి విజయవంతం చేసిన సిఎం కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ ఈసారి రైతుసంఘాల నేతల పిలుపును పట్టించుకోలేదు! కనుక రాష్ట్రంలో టిఆర్ఎస్ నేతలు, రైతులు ఆందోళనలు చేయలేదు. అంటే ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రహోంమంత్రి అమిత్ షాలను కలిసివచ్చిన తరువాత సిఎం కేసీఆర్ వ్యవసాయ చట్టాలపై వెనక్కు తగ్గారా? అందుకే ఢిల్లీలో రైతు సంఘాల నేతలను కలువకుండా హైదరాబాద్ తిరిగివచ్చేశారా? అందుకే రాష్ట్రంలో టిఆర్ఎస్ శ్రేణులు, రైతులు ఆందోళనలు చేయలేదా? ప్రధాని నరేంద్రమోడీ-సిఎం కేసీఆర్‌ల మద్య రాజీ కుదిరింది కనుకనే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఢిల్లీ నుండి పిలుపువచ్చిందా? ఈ విషయంలో సిఎం కేసీఆర్ వెనక్కు తగ్గినందుకు ప్రతిగా రాష్ట్రంలో బిజెపి నేతలు తమ జోరు తగ్గించుకొని మళ్ళీ ఎప్పటిలాగే టిఆర్ఎస్ పట్ల మెతకవైఖరి అవలంభించాలని నచ్చజెప్పేందుకే బిజెపి అధిష్టానం బండి సంజయ్‌ను ఢిల్లీకి పిలిపించిందా? అనే ప్రశ్నలన్నిటికీ బండి సంజయ్ ఢిల్లీ నుండి తిరిగివచ్చిన తరువాత టిఆర్ఎస్ పట్ల అనుసరించబోయే తీరును బట్టి సమాధానాలు దొరకవచ్చు.