 
                                        రాష్ట్రంలో పోలీస్, విద్యాశాఖతో సహా అన్ని ప్రభుత్వ విభాగాలలో ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయాలని సిఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఇవాళ్ళ ఆదేశించారు. అధికారుల ప్రాధమిక అంచనా ప్రకారం అన్ని శాఖలలో కలిపి సుమారు 50,000 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. సిఎం కేసీఆర్ వాటి భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కనుక త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. 
అయితే ఇంతకాలం ప్రభుత్వ శాఖలలో ఖాళీలను భర్తీ చేయాలని ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలంగాణ జనసమితి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోని సిఎం కేసీఆర్ హటాత్తుగా ఒకేసారి 50,000 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలోచింపజేస్తోంది. బహుశః దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో చేదు అనుభవాల కారణంగానో లేదా త్వరలో జరుగబోయే వరంగల్, ఖమ్మం మునిసిపల్ ఎన్నికలు మరియు రెండు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనో సిఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండవచ్చు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రతిపక్షాలు ప్రధానంగా నిరుద్యోగం, నిరుద్యోగభృతి, ఉద్యోగాల భర్తీలనే అస్త్రాలుగా చేసుకొని టిఆర్ఎస్‌తో పోరాడబోతున్నాయి. కనుక ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకే సిఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నారేమో?
ఇల్లలకాగానే పండుగ కాదన్నట్లు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ప్రకటించి పరీక్షలు నిర్వహించగానే ఉద్యోగాలు భర్తీ కావనే సంగతి అందరికీ తెలిసిందే. మద్యలో కోర్టు కేసులతో కొంత ఆలస్యమైతే ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసి ఉద్యోగాలలోకి తీసుకోవడానికి కూడా ఎందుకో ఆలస్యమవుతోంది. ఒకటి-రెండేళ్ల క్రితం ఉపాధ్యాయ, పోలీస్ కానిస్టేబుల్స్ గా ఎంపికైనవారు తమను ఉద్యోగాలలో తీసుకోవాలని ప్రగతి భవన్ ఎదుట ధర్నాలు చేయడం అందరూ చూశారు. దీంతో ప్రభుత్వ చిత్తశుద్దిపై నిరుద్యోగులకు సందేహాలు కలుగడం సహజం. నోటిఫికేషన్‌లు జారీ చేయడానికి, ఉద్యోగాలను భర్తీ చేయడానికి మద్య చాలా దూరం...కాలం ఉంటుందని అర్ధమవుతుంది. కనుక ఈసారి మద్యలో ఆలస్యం జరుగకుండా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేసి నిజంగా 50,000 ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తే అందరూ హర్షిస్తారు.