కేంద్రంతో సిఎం కేసీఆర్‌ సమరమా.. సామరస్యమా?

December 12, 2020


img

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం కేసీఆర్‌ శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబందించిన పెండింగ్ ప్రాజెక్టులు, బిల్లులు, నిధులు తదితర అంశాల గురించి చర్చించారని మీడియా చెపుతోంది. 

అయితే దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా సిఎం కేసీఆర్‌, మంత్రులు కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటమే కాక, కేంద్రప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన రైతులు ఆందోళనలకు సిఎం కేసీఆర్‌ మద్దతు ప్రకటించడం, వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తూ భారత్‌ బంద్‌లో టిఆర్ఎస్‌ మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని రాష్ట్రంలో బంద్‌ను విజయవంతం చేయడం వంటివి ప్రధాని నరేంద్రమోడీ పట్టించుకోకుండా, రాష్ట్ర సమస్యల గురించి సిఎం కేసీఆర్‌ చెప్పిందంతా శ్రద్దగా విని సానుకూలంగా స్పందించారనుకోవడం రాజకీయ అజ్ఞానమే అవుతుంది. 

అలాగే దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిజెపి చేతిలో ఎదురుదెబ్బలు తిన్న సిఎం కేసీఆర్‌, దేశంలో బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలను కూడగట్టి తన ప్రభుత్వానికి సవాలు విసరబోతున్నారని ప్రధాని నరేంద్రమోడీకి తెలియదనుకోలేము. కనుక మీడియాలో వ్రాసుకొన్నట్లు వారిరువురూ తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులకు అనుమతుల గురించి మాత్రమే చర్చించుకొన్నారనుకోలేము. ఈ తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో వారిరువురూ ఖచ్చితంగా రాజకీయాలపై చర్చించుకొని ఉండవచ్చు. 

వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తూ భారత్‌ బంద్‌కు సిఎం కేసీఆర్‌ మద్దతు ఇచ్చారు కనుక ఒకవేళ ఆయన రేపు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుసంఘాల నాయకులను, వారికి మద్దతు ఇస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలను కలిస్తే ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు లేదని కేంద్రంతో యుద్ధానికే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతుంది. అప్పుడు రాష్ట్ర బిజెపి నేతలు కూడా టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై మళ్ళీ ఇంకా గట్టిగా యుద్ధభేరీ మ్రోగించడం మొదలుపెడతారు. 

ఒకవేళ సిఎం కేసీఆర్‌ ఢిల్లీలో రైతులను, ప్రతిపక్షనేతలను కలువకుండా హైదరాబాద్‌ తిరిగివచ్చేస్తే ఆయన కేంద్రంతో రాజీపడినట్లు భావించవచ్చు. అప్పుడు రాష్ట్ర బిజెపి నేతల జోరు తగ్గవచ్చు. కనుక టిఆర్ఎస్‌-బిజెపిల మద్య సమరమా... సామరస్యమా... అనేది ఒకటి రెండు రోజులలోనే తేలిపోవచ్చు.


Related Post