 
                                        పిసిసి అధ్యక్షుడి ఎంపిక కోసం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్  మానిక్కం టాగోర్ గత నాలుగు రోజులుగా కాంగ్రెస్ నేతలు, జిల్లా అధ్యక్షులు అందరినీ కలిసి అభిప్రాయసేకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆయనపై అనుమానాలు వ్యక్తం చేశారు. 
ఈరోజు గాంధీభవన్‌లో ఆయనతో సమావేశమయ్యేందుకు వెళ్ళే ముందు జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “పిసిసి అధ్యక్షుడి ఎంపికపై ఏకాభిప్రాయంతో జరగాలి తప్ప మెజార్టీ నేతల అభిప్రాయంతో కాదు. అధ్యక్షుడి ఎంపిక కోసం జరుగుతున్న అభిప్రాయ సేకరణపై మాకు కొన్ని అనుమానాలున్నాయి. లోలోపల ఏదో కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోంది. సోనియా, రాహుల గాంధీలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం జరుగుతున్నట్లు మాకు అనుమానం కలుగుతోంది. ఆయన ఇవాళ్ళ సాయంత్రం ఢిల్లీ వెళ్ళి ఇక్కడి నేతల అభిప్రాయాలూ మా అధిష్టానానికి తెలియజేయబోతున్నారు. కనుక ఇప్పుడే మేము మానిక్కం టాగోర్‌తో తాడోపేడో తేల్చుకొంటాము.
అధ్యక్ష పదవి కోసం సోషల్ మీడియాలో ప్రచారం ఏమిటో అర్ధం కాదు. ఇదో పెద్ద తలనొప్పిలా మారింది. అటువంటివి పరిగణలోకి తీసుకోరాదని మేము మానిక్కం టాగోర్‌కు గట్టిగా చెప్పబోతున్నాము. ఒకవేళ నేతల వ్యక్తిగత అభిప్రాయాలకు తలొగ్గి ఆయన మా అధిష్టానానికి తప్పుడు నివేదిక ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. త్వరలో అనేక ఎన్నికలున్నాయి. కనుక అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తికే ఈ పదవి ఇవ్వాలని కోరుకొంటున్నాము. కాంగ్రెస్ పార్టీలో ఏ సామాజిక వర్గానికి ఈ పదవి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు కానీ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలి. అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి సోనియా, రాహుల్ గాంధీలను కలిసి మా అభిప్రాయాలను తెలియజేస్తాము. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి నష్టపోకుండా కాపాడుకొంటాము,” అని అన్నారు.
అంటే మానిక్కం టాగోర్‌తో సహా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు సోనియా, రాహుల గాంధీలను తప్పు దోవ పట్టిస్తున్నారని జగ్గారెడ్డి చెప్పకనే చెప్పారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మానిక్కం టాగోర్ మరికొందరు సీనియర్ నేతలు కలిసి రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా ఎంపిక చేసేందుకు సిద్దమయ్యారని, దానిని తాము (కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వి.హనుమంతరావు తదితరులు) వ్యతిరేకిస్తామని జగ్గారెడ్డి చాలా స్పష్టంగానే చెప్పారని అర్ధమవుతోంది. ఒకవేళ రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీ నష్టపోతుందని జగ్గారెడ్డి హెచ్చరికకు అర్ధం ఏమిటంటే రేవంత్ రెడ్డి అనుకూల వ్యతిరేక వర్గాలతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిలువునా చీలిపోయే ప్రమాదం ఉందనుకోవాలేమో?
పిసిసి అధ్యక్షుడి ఎంపికలో ఇన్ని సమస్యలున్నందునే కాంగ్రెస్ అధిష్టానం ఇంతకాలం ఉత్తమ్ కుమార్ రెడ్డినే అధ్యక్షుడిగా కొనసాగించిందని అర్ధమవుతోంది. కానీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ అధిష్టానానికి అగ్నిపరీక్ష పెట్టారు. మరి ఈ గండం ఎలా గట్టెక్కుతుందో చూడాలి.
అయినా ఓ పక్క కాంగ్రెస్ టైటానిక్ నావ మునిగిపోతోందని భావించి నేతలు నౌకలో నుంచి బయటకు దూకేస్తుంటే మరోపక్క రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి సీనియర్ నేతలు మునిగిపోతున్న టైటానిక్ నౌకను నేను నడుపుతానంటే నేనే నడుపుతానంటూ కీచులాడుకొంటుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.