.jpg) 
                                        పిసిసి అధ్యక్ష పదవి కోసం ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఆ పార్టీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మానిక్కం టాగోర్ గత నాలుగురోజులుగా గాంధీభవన్‌లో పార్టీ నేతలందరితో వరుస సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేస్తుంటే, మరోపక్క ఆ పదవిని ఆశిస్తున్న నేతలు సోషల్ మీడియాలో అనుకూలంగా ప్రచారం చేయించుకోవడం విశేషం. పార్టీలో అంతర్గతంగా జరగవలసిన ఈ వ్యవహారాన్ని సోషల్ మీడియాలోకి ఎక్కించడంపై కొందరు సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
రాష్ట్రంలో 15-18 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, వారి అనుచరులు రేవంత్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఈ రేసులో ఉన్న మిగిలిన అభ్యర్ధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై వారు నేడు గాంధీభవన్‌లో మానిక్కం టాగోర్ సమక్షంలో చర్చించడానికి సమావేశమయ్యారు. ఓ పక్క కొత్త అధ్యక్షుడి ఎంపికపై పార్టీలో చర్చిస్తుండగా మరోపక్క రేవంత్ రెడ్డి వర్గం సోషల్ మీడియాలో అనుకూలంగా ప్రచారం చేసుకోవడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మానిక్కం టాగోర్ సమక్షంలో గాంధీభవన్‌లో జరుగుతున్న సమావేశంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పోడెం వీరయ్య తదితరులు పాల్గొని ఈ సోషల్ మీడియా ప్రచారంపై చర్చిస్తున్నారు. ఇవాళ్ళ సాయంత్రంలోగా అభిప్రాయసేకరణ కార్యక్రమం పూర్తిచేసి మానిక్కం టాగోర్ హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీ చేరుకొని ఆ వివరాలను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలియజేస్తారు.
దానిపై రాహుల్ గాంధీ, పార్టీలో సీనియర్ నేతలతో చర్చించిన తరువాత తెలంగాణ పిసిసి అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారు. ఈ నెలాఖరులోగా కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించవచ్చు. అయితే అధ్యక్షుడిగా ఎవరి పేరు ప్రకటించినా మిగిలినవారు అలకపాన్పు ఎక్కే అవకాశం ఉంటుంది కనుక వారిని బుజ్జగించడం, వారి వలన పార్టీకి నష్టం కలుగకుండా చూసుకోవడం వంటి తలనొప్పులకు కూడా సిద్దం కావలసి ఉంటుంది.