 
                                        సిఎం కేసీఆర్ నిన్న ఢిల్లీ చేరుకోగానే ముందుగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీకి అనుమతులు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తదితర అంశాల గురించి చర్చించారు. ఆ తరువాత కేంద్రహోంమంత్రి అమిత్ షానివాసానికి వెళ్ళి ఆయనను కలిసి ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, హైదరాబాద్ నగరంలో వచ్చిన వరదలు వాటి వలన రాష్ట్రానికి,నగరానికి జరిగిన నష్టం గురించి వివరించి, వరదసాయం అందజేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.   
ఇవాళ్ళ అంటే శనివారం కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం గురించి, పౌరవిమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పురీని కలిసి వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు సిఎం కేసీఆర్ వినతులు చేయనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్ లభిస్తే ఆయనతో కూడా సమావేశమయ్యి రాష్ట్రానికి సంబందించిన సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులు, నిధులు, వరదసాయం తదితర అంశాల గురించి మాట్లాడుతారని సమాచారం.
దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల సందర్భంగా సిఎం కేసీఆర్‌తో సహా ప్రచారంలో పాల్గొన్న టిఆర్ఎస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇవ్వలేదని పదేపదే ఆరోపించారు. వరదసాయం చేయాలని సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీకి లేఖవ్రాసినప్పటికీ పట్టించుకోలేదని, దాంతో రాష్ట్ర ప్రభుత్వమే హైదరాబాద్ వరదబాధితులకు రూ.10,000 చొప్పున సాయం అందిస్తోందని చెప్పుకొన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళుతున్న పన్నులలో న్యాయంగా రావలసిన వాటాను కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిలో కేంద్రం పాత్ర లేదన్నట్లే మాట్లాడారు.
కానీ ఇప్పుడు అదే సిఎం కేసీఆర్...ఢిల్లీ వెళ్ళి కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు! రాష్ట్రాభివృద్ధికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు! ఒకవేళ కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వదని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపనులకు సహకరించదని సిఎం కేసీఆర్, మంత్రులు చెప్పింది నిజమే అయితే ఢిల్లీ వెళ్ళి కేంద్రమంత్రులను కలవవలసిన అవసరమే లేదు కదా? అంటే ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ చెప్పిందంతా అబద్దమా? బిజెపి చెప్పింది అబద్దామా?అని ఆలోచిస్తే ఎన్నికలప్పుడు ప్రజలలో సెంటిమెంట్ రగిల్చి రాజకీయ లబ్ది పొందేందుకు కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని తిట్టిపోస్తూ, ఎన్నికలవగానే మళ్ళీ కేంద్రం సాయం కోరుతుండటం ద్వంద వైఖరిగానే భావించాల్సి ఉంటుంది. రాష్ట్రాల అభివృద్ధిలో కేంద్రం పాత్ర ఖచ్చితంగా ఉందని అర్దమవుతుంది. రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని, అభివృద్ధి పనులు చేపట్టలంటూ సిఎం కేసీఆర్ వినతులే ఇందుకు నిదర్శనం. కానీ ఈ ద్వందవైఖరిని ప్రజలు గుర్తించలేరని టిఆర్ఎస్ అనుకొంటే అవివేకమే అవుతుంది.