 
                                        కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం వరంగల్ నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, "హైదరాబాద్ తరువాత అంత పెద్ద, ప్రాధాన్యత ఉన్న వరంగల్ నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్రప్రభుత్వం నిధులు అందిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నగరాన్ని అభివృద్ధి చేయడం లేదు. నగరంలో కేంద్రప్రభుత్వం నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి పధకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పధకం యావత్ దేశంలో అమలవుతుంటే సిఎం కేసీఆర్ తప్పుడు నిర్ణయం వలన రాష్ట్రంలో అమలుకు నోచుకోవడంలేదు. ఆ కారణంగా రాష్ట్రంలో పేదప్రజలకు ఆయుష్మాన్ భారత్ పధకాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. కేంద్రప్రభుత్వం మమునూరు వద్ద విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకుండా తాత్సరం చేస్తోంది. ఇప్పటికైనా తగినంత భూమి ఇస్తే కేంద్రప్రభుత్వం విమానాశ్రయం నిర్మించి ఇస్తుంది. 
జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టిఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో వరదబాధితులకు రూ.10,000 చొప్పున పంచిపెట్టింది. వరద బాధితుల కష్టాలు ఎక్కడైనా ఒక్కలాగే ఉంటాయి కనుక వరంగల్‌లో వరద బాధితులకు కూడా రూ.10,000 చొప్పున వరదసాయం అందించాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. బిజెపిని దెబ్బతీసేందుకే హడావుడిగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తే టిఆర్ఎస్సే దెబ్బతిని బోర్లాపడింది," అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇంతకాలం రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని, నిధులు విడుదల చేయడం లేదని తెరాస మంత్రులు, నేతలు ఆరోపించడం విన్నాము. కానీ తొలిసారిగా వరంగల్ అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం సహకరించడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించడం విశేషం.