 
                                        డబ్బు, మద్యం, కులమతాల సమీకరణలు, ప్రజలపై పార్టీల, మీడియా ప్రభావాలు, పార్టీల రాజకీయ ఎత్తులు, వ్యూహాలు, ఎన్నికల వేళలో ఒత్తిళ్ళు, అభ్యర్ధుల బలాబలాలు మొదలైన అనేక అంశాలు అభ్యర్ధుల జయాపజయాలని నిర్ణయిస్తుంటాయని అందరికీ తెలుసు. ఇవన్నీ కలిసివస్తే గెలుపు...వీటిలో ఏ ఒక్కటి తేడా వచ్చినా ఓటమి తప్పదు. ఈ నేపధ్యంలో ఎన్నికల ఫలితాలు నిజంగా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఎలా అనుకోగలము? కానీ ఫలితాలను బట్టే పార్టీల వాదనలు కూడా ఉంటాయి. 
అందుకు ఉదాహరణగా దుబ్బాకలో స్వల్ప తేడాతో ఓడిపోయిన టిఆర్ఎస్ మాకు ప్రజాధారణ ఏమాత్రం తగ్గలేదని చెప్పుకొంటే, స్వల్ప తేడాతో గెలిచినా ప్రజలు మావైపే ఉన్నారని బిజెపి చెప్పుకొంది! గ్రేటర్ ఎన్నికలలో ఓడిపోయిన టిఆర్ఎస్, 56 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించినందున ప్రజలు తమవైపే ఉన్నారని వాదిస్తుంటే, టిఆర్ఎస్‌ను అడ్డుకొని 48 సీట్లు గెలుచుకొన్నందుకు ప్రజలు మార్పు కోరుకొంటున్నారని బిజెపి నేతలు వాదిస్తున్నారు! గ్రేటర్ ఎన్నికలలో కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకొని దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ సైద్దాంతికంగా మేమే గెలిచామని చెప్పుకొంది. అంటే ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోయినా ప్రజలు తమవైపే ఉన్నారని వాదిస్తూ ప్రజలను కూడా నమ్మమని కోరుతున్నాయన్నమాట! కర్ర ఉన్నవాడిదే బర్రె అనే సామెత ప్రకారం ఎవరు అధికారంలో వారి మాటే శాసనం...వారు చెప్పిందే నిజమని సర్దిచెప్పుకోక తప్పదు.