 
                                        కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఇవాళ్ళ వరంగల్‌లో భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొనేందుకు వెళుతూ దారిలో జనగామలో ఆగినప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “ఒక్క దుబ్బాక... గ్రేటర్ పరిధిలో ప్రజలు మాత్రమే కాకుండా యావత్ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకొంటున్నారు. అందుకే రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. సిఎం కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఉద్యమకారుల ఆకాంక్షలను కేవలం బిజెపి నెరవేర్చగలదు. అందుకే రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడు బిజెపివైపు మొగ్గుచూపుతున్నారు,” అని అన్నారు.   
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొంటున్నారని దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బిజెపి నేతలు గట్టిగా ప్రచారం చేసుకొని ఆశించిన ఫలితం పొందారు. కేవలం 50 శాతం లేదా అంతకంటే తక్కువమంది వేసిన ఓట్లు మూడు నాలుగు పార్టీల మద్య చీలితే ఒక్కో పార్టీకి 10-20 శాతం కంటే తక్కువ వస్తుంది. మరి అంత తక్కువ ఓటింగ్ శాతంతో గెలిచిన పార్టీలు, ఓట్లు వేయని మిగిలిన 50 శాతం ఓటర్ల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయనుకోగలమా? అటువంటప్పుడు ప్రజలు మార్పు కోరుకొంటున్నారని ఏవిధంగా నిర్ధారించగలము? కనుక ఎన్నికలలో గెలుపే ప్రజాభిప్రాయానికి కొలమానంగా భావించలేము.
సిఎం కేసీఆర్ నేతృత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోంది. కనుక సిఎం కేసీఆర్ నిరంకుశ్వతం, కుటుంబ పాలనలతో ప్రతిపక్షాలకే తప్ప ప్రజలకు అభ్యంతరాలుంటాయని అనుకోలేము. కానీ కాలగమనంలో ఏ ప్రభుత్వంపైనైనా ప్రజలలో క్రమంగా వ్యతిరేకత పెరుగుతుంటుంది. అది సహజం. కనుక ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలతో పాటు సిఎం కేసీఆర్ నిరంకుశ్వతం, కుటుంబపాలన,అవినీతి వంటివి కూడా ప్రజలలో వ్యతిరేకత పెరిగేందుకు దోహదపడవచ్చు.
అటువంటి వారి సంఖ్య రాష్ట్రంలో 30-40 శాతం ఉందనుకొంటే ఆ శాతాన్నే ఇంకా పెంచి లబ్ది పొందేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుంటాయి. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలే ప్రామాణికంగా భావిస్తాము కనుక గెలిచిన పార్టీ చెప్పిందే నిజమని నమ్మవలసివస్తోంది. బీజేపీ నేతలు చెప్పుకొంటున్నట్లు రాష్ట్రంలో ప్రజలు నిజంగానే మార్పు కోరుకొంటున్నట్లయితే ఇక ముందు జరుగబోయే ఎమ్మెల్సీ, వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా బీజేపీ భారీ మెజార్టీతో గెలవవలసి ఉంటుంది.