 
                                        ఇటీవల బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోల్‌కతాలోని డైమండ్ హార్బర్ అనే ప్రాంతంలో బిజెపి కార్యకర్తలతో సమావేశమయ్యేందుకు వెళుతుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తలు ఆయన కారుపై రాళ్ళతో దాడి చేశారు. ఆ ఘటనలో ఆయన కారు అద్దం పగిలిపోయింది. దీనిని తీవ్రంగా తీసుకొన్న కేంద్ర హోంశాఖ  పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిని, ఆ రాష్ట్ర డిజిపిని సంజాయిషీ కోరుతూ నోటీసులు పంపించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తక్షణం నివేదిక ఇవ్వాలసిందిగా కేంద్రహోంమంత్రి అమిత్ షా పశ్చిమబెంగాల్ గవర్నర్‌కు లేఖ వ్రాశారు. 
దేశంలో ఒక్కో రాష్ట్రంలో పట్టుపెంచుకొంటూ విస్తరిస్తున్న బిజెపి, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కూడా పట్టు పెంచుకొనేందుకు గత ఆరేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. దాంతో సిఎం మమతా బెనర్జీ, ఆమె పార్టీ నేతలు కూడా బిజెపిని అడ్డుకొనేందుకు అంతే గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
టీఎంసీ-బిజెపిల మద్య జరుగుతున్న ఈ ఆధిపత్యపోరులో రెండు పార్టీల మద్య ఇటువంటి ఘర్షణలు తరచూ జరుగుతునే ఉన్నాయి. అయితే టీఎంసీ కార్యకర్తలు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపైనే భౌతికదాడికి ప్రయత్నించడం బిజెపికి కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అందుకే దీనిని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకొనేందుకు సిద్దం అవుతోంది. కనుక రెండు పార్టీల మద్య పతాకస్థాయికి చేరిన ఈ పోరాటం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.