వరదసాయం టిఆర్ఎస్‌కు గుదిబండగా మారనుందా?

December 11, 2020


img

హైదరాబాద్‌ వరదబాధితులకు గత మూడు రోజులలో మొత్తం రూ.28.44 కోట్లు అందజేశామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి గురువారం వరకు ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున మొత్తం 28,436 మందికి వరదసాయం సొమ్ము రూ.28.44 కోట్లు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలో జమాచేశామని చెప్పారు. దీంతో ఇప్పటివరకు నగరంలో రూ.692 కోట్లు అందజేశామని చెప్పారు.

ప్రభుత్వం వరదలలో నష్టపోయినవారిని ఆదుకొనేందుకే వరదసాయం ప్రకటించినప్పటికీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే డబ్బు పంచిపెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. కానీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ ఓడిపోవడంతో వ్రతం చేసినా ఫలం దక్కన్నట్లయింది.

పైగా నగరంలో ఇంకా ఎంతమంది వరదసాయం కోసం ఎదురుచూస్తున్నారో తెలియనందున ఇంకా ఎంతకాలం ఈ వరదసాయం అందించాలో...దానికి ఎంత ఖర్చవుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ఇది ప్రభుత్వానికి చాలా భారంగా మారుతుందని నిలిపివేస్తే, జీహెచ్‌ఎంసీ ఎన్నికలైపోయాయి కనుకనే నిలిపివేసిందని వరదబాధితులు, ప్రతిపక్షాలు కూడా టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని ఆక్షేపించవచ్చు. ఒకవేళ వరదసాయం సొమ్ము పంపిణీ చేస్తూ పోతే ఖజానా ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక వరంగా మారుతుందనుకొన్న వరదసాయం టిఆర్ఎస్‌కు గుదిబండగానే మారిందనుకోవచ్చు.


Related Post