గల్లీ మే కుస్తీ అయిపోయింది ఇక ఢిల్లీ మే దోస్తీ?

December 11, 2020


img

సిఎం కేసీఆర్‌ నేడు మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతుండటంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌-ఛార్జ్ మానికం టాగూర్ స్పందిస్తూ, “ప్రధాని నరేంద్రమోడీకి లేఖ వ్రాసిన సిఎం కేసీఆర్‌ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులను కలిసేందుకు వెళుతున్నారా లేదా ఢిల్లీ మే దోస్తీ..కార్యక్రమంలో భాగంగా వెళుతున్నారా?అదే అయితే ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించడం ఒట్టి మాటలేనా?” అని ట్వీట్ చేశారు. 


దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌-బిజెపిలు హోరాహోరీగా పోరాడుకొంటున్నప్పుడు, ఆ రెండు పార్టీలు ‘గల్లీ మే కుస్తీ ఢిల్లీ మే దోస్తీ...’ చేస్తున్నాయంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఎద్దేవా చేశారు. పైకి ఆ రెండు పార్టీలు పరస్పరం కత్తులు దూసుకొంటున్నప్పటికీ ఢిల్లీ స్థాయిలో వాటిమద్య మంచి అవగాహన ఉందని వాదించారు. 

వారి వాదనలను టిఆర్ఎస్‌ కొట్టిపడేసినప్పటికీ, కొత్త పార్లమెంటు భవనం  శంఖుస్థాపన సందర్భంగా సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీని అభినందిస్తూ లేఖ వ్రాయడం, ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రమంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళుతుండటం కాంగ్రెస్‌ వాదనలకు బలం చేకూర్చినట్లయింది. అందుకే “గల్లీలో కుస్తీ (జీహెచ్‌ఎంసీ ఎన్నికలు) అయిపోయింది కనుక మళ్ళీ ఢిల్లీ మే దోస్తీ కార్యక్రమం మొదలుపెట్టారా?” అని మానికం టాగూర్ ఎద్దేవా చేశారని భావించవచ్చు. 

ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ఏ పార్టీకి చెందినప్పటికీ రాష్ట్రానికి సంబందించిన సమస్యలు, ప్రాజెక్టుల గురించి           కేంద్రప్రభుత్వంతో, ప్రధాని, కేంద్రమంత్రులతో మాట్లాడేందుకు వారితో భేటీకాక తప్పదు. కానీ  కేంద్రప్రభుత్వం వేరు... దానిని నడిపిస్తున్న బిజెపి వేరు కనుక ఒక ముఖ్యమంత్రిగా కేంద్రప్రభుత్వానికి సహకరిస్తూనే, బిజెపితో రాజకీయంగా యుద్ధం చేస్తూనే ఉంటామని సిఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పారు. 

సిఎం కేసీఆర్‌ చెప్పింది వాస్తవమే కానీ ప్రదాని మోడీని అభినందిస్తూ లేఖ వ్రాసి, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆయనపై ఒత్తిడి తెస్తానని చెపితే నమ్మశక్యంగా ఉండదు. ఈవిధంగా ఒక వ్యక్తి కేంద్రంతో ఒకలాగా, దానిని నడిపిస్తున్న బిజెపితో మరొకలాగ వ్యవహరిస్తుంటే మన పాత సినిమాలలో తరచూ కనిపించే ఓ సన్నివేశం గుర్తొస్తుంది. ఇన్‌స్పెక్టర్‌ పనిచేస్తున్న ఓ అన్న, నేరస్థుడైన తన తమ్ముడిని బందించేందుకు ప్రయత్నిస్తూనే మళ్ళీ ఓ అన్నగా తన సోదరుడు నేరస్థుడు కాదని నిరూపించేందుకు ప్రయత్నిస్తూ మానసిక సంఘర్షణతో నలిగిపోవడం... చివరికి వారి కధ సుఖాంతం అవడం అందరికీ గుర్తుండే ఉంటుంది.

కేంద్రప్రభుత్వం-టిఆర్ఎస్‌ ప్రభుత్వం; టిఆర్ఎస్‌-బిజెపిల మద్య నడుస్తున్న ఈ దోస్తీ-కుస్తీలు చూస్తున్నప్పుడు ఆ సన్నివేశాలు గుర్తొస్తే ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పుడు ఆ పాత సినిమాలలోలాగ ఎవరూ మానసిక సంఘర్షణతో నలిగిపోవడం లేదు. తమ్ముడు తమ్ముడే... పేకాట పేకాటే... అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. అందుకే ప్రతిపక్షాలకు తెరాస, బిజేపీలను ఈవిధంగా విమర్శించే అవకాశం లభిస్తోందని భావించవచ్చు. 


Related Post