 
                                        ఇటీవల బిజెపిలో చేరిన విజయశాంతి ఇవాళ్ళ నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో అడుగుపెట్టారు. పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఆమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నేను తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు కేసీఆర్ టిడిపిలో ఉన్నారు. ఆ తరువాత టిఆర్ఎస్‌ను స్థాపించిన కేసీఆర్, తెలంగాణ ఉద్యమంలో తాను తప్ప మరొకరు ఉండకూడదనే దురుదేశ్యంతో ఆలె నరేంద్రను నావద్దకు పంపించి నా పార్టీని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలని ఒత్తిడి చేశారు. టిఆర్ఎస్‌లో చేరిన తరువాత నేను కూడా ఎంపీగా గెలవడం చూసి కేసీఆర్ తట్టుకోలేక నన్ను రాజకీయాల నుంచి దూరం చేయడానికి కుట్రలు పన్నారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లు సంకేతాలు ఇవ్వగానే ఆయన కంటే ముందు నుండి తెలంగాణ కోసం కొట్లాడిన నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపించేశారు. ఆనాడు తెలంగాణ ఉద్యమాలలో...మళ్ళీ ఇప్పుడు అధికారంలో తనకు, తన కుటుంబానికి తప్ప వేరెవరికీ ప్రాధాన్యం లేకుండా చేసుకొని సిఎం కేసీఆర్ నిరంకుశపాలన సాగిస్తున్నారు. ఆయనను ధీటుగా ఎదుర్కోవలసిన కాంగ్రెస్ నేతలు తమలో తామే కలహించుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు. అందుకే సిఎం కేసీఆర్‌ను, టిఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొంటున్న బిజెపిలో చేరాను. రాష్ట్రంలో బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించింది కనుక రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు రోజులు దగ్గరపడ్డాయి... త్వరలోనే టిఆర్ఎస్ కనుమరుగు కాబోతోంది,” అని విజయశాంతి అన్నారు.