నేను కూడా పిసిసి రేసులో ఉన్నా: అంజన్‌ యాదవ్

December 10, 2020


img

పిసిసి అధ్యక్ష పదవి రేసులో కొత్తగా మరో అభ్యర్ధి చేరారు. ఆయనే...హైదరాబాద్‌ నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్ యాదవ్. ఇవాళ్ళ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో అభ్యర్ధుల ఎంపిక తన ప్రమేయం లేకుండా జరిగిందని కేవలం సికింద్రాబాద్‌,ముషీరాబాద్ నియోజకవర్గాలలో అభ్యర్ధుల ఎంపికలో మాత్రమే తాను జోక్యం చేసుకొన్నానని అన్నారు. మిగిలిన నియోజకవర్గాలలో వి.హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వంటి సీనియర్ల కనుసన్నలలో అభ్యర్ధుల ఎంపిక జరిగిందన్నారు. కనుక జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఓటమి అపనింద భరించలేకనే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే చిరకాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నానని, కనుక పదోన్నతి కోరుకొంటున్నానని అన్నారు. పిసిసి అధ్యక్ష పదవికి చేపట్టేందుకు అన్నివిధాల అర్హత, అనుభవం కలిగి ఉన్నానని కనుక తాను కూడా రేసులో ఉన్నానని చెప్పారు. పిసిసి అధ్యక్ష పదవి కోసమే తాను నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. అయితే పదవి లభించినా లభించకపోయినా కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు....బిజెపిలో చేరేది లేదని అంజన్‌ కుమార్ యాదవ్ చెప్పారు. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో పార్టీ పెద్దలు తనను పట్టించుకోకుండా అభ్యర్ధులను ఎంపికచేయడంతో అంజన్‌ కుమార్ యాదవ్ అలకపాన్పు ఎక్కారు. ఆ వంకతో ఆయన బిజెపిలో చేరబోతున్నట్లు ఊహాగానాలు కూడా వినిపించడంతో కాంగ్రెస్‌ పెద్దలు హడావుడిగా ఆయన నివాసానికి వెళ్ళి బుజ్జగించడంతో ఆయన బెట్టువీడి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 

అయితే ఆయన పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నానని చెప్పకుండా పిసిసి అధ్యక్ష పదవి కోసమే రాజీనామా చేస్తున్నట్లు చెప్పడమే ఆలోచింపజేస్తుంది. 

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌-బిజెపిల మద్య జరిగిన పోరులో కాంగ్రెస్‌ ఏవిధంగా అడ్రస్ లేకుండాపోయిందో ఇప్పుడు పిసిసి అధ్యక్ష పదవి కోసం రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతల మద్య జరుగుతున్న పోటీలో మిగిలినవారు ప్రాధాన్యత కోల్పోయినట్లు కనిపిస్తోంది. పిసిసి అధ్యక్ష పదవిని ముగ్గురి రెడ్లలో ఎవరో ఒకరికి ఇవ్వక తప్పదనే పరిస్థితి కనిపిస్తోంది. బహుశః అందుకే బీసీ వర్గానికి చెందిన అంజన్‌ కుమార్ యాదవ్‌ బరిలో దిగి ఉండవచ్చు లేదా ఎవరో ఆయనను బరిలో దించి ఉండవచ్చు. 


Related Post