పార్టీ మారుతున్నానని చెప్పానా? జానా ప్రశ్న

December 10, 2020


img

ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్థానంలో కొత్త పిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేసుకొనేందుకు పార్టీ నేతలందరూ బుదవారం సాయంత్రం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. ఆ సమావేశం ముగిసిన తరువాత సీనియర్ కాంగ్రెస్‌ నేత కె.జానారెడ్డిని ‘మీరు కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో ఎప్పుడు చేరుతున్నారు?’ అని ప్రశ్నించగా ఆయన “నేను పార్టీ మారుతున్నానని మీకు ఎవరు చెప్పారు? నేను మీకు చెప్పానా? అంతా మీరే వ్రాసుకొంటారు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు. ఈ పుకార్లపై మీరే (మీడియా) సంజాయిషీ ఇవ్వాలి... నేను కాదు. నేను ఎన్నటికీ కాంగ్రెస్ పార్టీని వీడబోను. అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేనే ముఖ్యమంత్రి అభ్యర్ధిని అటువంటప్పుడు పార్టీ ఎందుకు మారుతాను?” అని ఎదురు ప్రశ్నించారు.

‘నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో పోటీ చేస్తారా?’ అని విలేఖరులు ప్రశ్నించగా “ఎవరు పోటీ చేయాలో మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది,” అని జానారెడ్డి సమాధానం చెప్పి వెళ్ళిపోయారు. 

జానారెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరుతున్నారంటూ మీడియాలో ఊహాగానాలు వినిపించడానికి కారణం, త్వరలో నాగార్జునసాగర్ ఉపఎన్నికలు జరుగబోతుండటమే. సాగర్ టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంతో ఉపఎన్నికలు జరుగబోతున్నాయి. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో సత్తా చాటుకొన్న బిజెపి ఇదే ఊపులో సాగర్‌ ఉపఎన్నికలలో కూడా సత్తా చాటుకొనేందుకుగాను కె.జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చి పోటీ చేయించాలని తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ ప్రయత్నాలలో భాగంగా జానారెడ్డి, రఘువీర్ రెడ్డి ఇద్దరినీ బిజెపిలో చేరవలసిందిగా ఆహ్వానించిందని, అందుకు రఘువీర్ రెడ్డి సానుకూలంగా స్పందించారని వార్తలు వచ్చాయి. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఘోరపరాజయంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత అయోమయంగా మారింది కనుక కె.జానారెడ్డి అండ్ సన్స్ బిజెపిలో చేరడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ జానారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని చెపుతున్నారు. సాగర్‌ ఉపఎన్నికలు దగ్గరపడేవరకు ఈ సస్పెన్స్ కొనసాగవచ్చు.


Related Post