ఆస్తులు తాకట్టు పెట్టి పేదలకు సాయపడుతున్న సోనూసూద్

December 09, 2020


img

అరుందతి సినిమాలో ‘వదల బొమ్మాళీ...వదలా...” అంటూ తెలుగు ప్రజలను హడలెత్తించిన విలన్ సోనూసూద్ నిజజీవితంలో ఎంతమంచివాడో...ఎంత ధర్మాత్ముడో లాక్‌డౌన్‌ సమయంలో దేశప్రజలందరికీ తెలిసింది. లాక్‌డౌన్‌ సమయంలో వేలాదిమంది వలస కార్మికులను, ఇతర దేశాలలో చిక్కుకుపోయినవారినీ తన సొంతఖర్చుతో సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చారు. 

దేశంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా... నేనున్నానంటూ ఆదుకొన్నాడు. చిన్నపిల్లలు, విద్యార్దులకు పుస్తకాలు, సైకిళ్ళు, ల్యాప్‌టాపులు, మొబైల్ ఫోన్స్, పేదలకు ఆహారం, ఉపాది, ఇళ్ళు ఏర్పాటు చేశాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి మందులు, అత్యవసర చికిత్సలు అందించి ఎందరివో ప్రాణాలు కాపాడాడు. సుమారు 10 నెలలుగా దేశవ్యాప్తంగా ఉన్న పేదలకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నాడు. నేటికీ ఇంకా చేస్తూనే ఉన్నాడు. 

సోనూసూద్ చేస్తున్న ఈ సహాయకార్యక్రమాలను చూసి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, ఇంకా దేశంలో వివిదబాషల సినీ ప్రముఖులు అందరూ మెచ్చుకొంటూ రెండు ట్వీట్లు చేసి చేతులుదులుపుకొన్నారే తప్ప ఎవరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పేదలను, నిసహాయులను ఆదుకోలేదనే చెప్పాలి. కనీసం సోనూసూద్‌ వెంట నిలిచి ఆయనకు నిధులు సమకూర్చలేదు. అయినప్పటికీ సోనూసూద్ తనపని తాను చేసుకుపోతూనే ఉన్నాడు తప్ప ఏనాడూ ఎవరినీ సాయం చేయమని అడగలేదు. నేటికీ తన సహాయకార్యక్రమాలు యదాతదంగా కొనసాగిస్తూనే ఉన్నాడు. 

అయితే ఒక ప్రభుత్వమే చేయలేని ఇన్ని సహాయకార్యక్రమాలను ఒక్కడే చేయాలంటే ఎన్ని ఆస్తులు ఉన్నా సరిపోవు. కర్పూరంలా కరిగిపోతూనే ఉంటాయి. సోనూసూద్ విషయంలో కూడా ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ దానధర్మాలకు కర్పూరంలా కరిగిపోతున్నాయి. ఎంతగా అంటే...ఏళ్ళతరబడి సినీపరిశ్రమలో కష్టపడి సంపాదించుకొన్న విలువైన ఆస్తులను తనఖాపెట్టి అప్పు తెచ్చుకొనేంత! సెప్టెంబర్ 15వ తేదీన సోనూసూద్ ముంబైలో తనకున్న 8 విలువైన ఆస్తులను తాకట్టు పెట్టి రూ.10 కోట్లు అప్పు తీసుకొన్నారని, వాటి రిజిస్ట్రేషన్స్ నవంబర్‌ 24వ తేదీన జరిగాయని మనీ కంట్రోల్ అనే సంస్థ బయటపెట్టింది. కానీ ఈవిషయం ఆయన ఎన్నడూ ఎవరికీ చెప్పుకోలేదు. 

ఆస్తులు తాకట్టు పెట్టి మరీ పేదలకు సాయం చేస్తూనే ఉన్నాడు. దీనిని తనకు మాలిన ధర్మం అని అనేయవచ్చు కానీ ఏనాడూ తన మొహం కూడా చూడని ఎందరో నిర్భాగ్యులు తనపై పెట్టుకొన్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే తపనతోనే సోనూసూద్ ఇంత సాహసానికి పూనుకొన్నాడు.

దేశం నలుమూలల నుంచి సాయం కోరుతూ రోజూ డజన్లకొద్దీ లేఖలు వస్తుంటాయని వాటిని చూస్తున్నప్పుడు వారి కష్టాలతో పోలిస్తే తన కష్టం ఏపాటిదనిపిస్తుందని, వారి కోసం ఎంత చేసినా తక్కువేనని, సాయం కోరిన అందరికీ సాయపడలేకపోతున్నందుకు మనసులో బాధగా ఉంటుందని సోనూసూద్ చెప్పడం ఆయన విశాలహృదయానికి, మానవత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.


ప్రభుత్వాలు చేయలేని పనిని ఒక సినీనటుడు చేస్తుండటం మామూలు విషయం కాదు. ఇకనైనా మన సినీ, రాజకీయ, పారిశ్రామిక తదితర రంగాలకు చెందిన ప్రముఖులు సోనూసూద్‌కు అండగానిలబడితే వారి జన్మ కూడా ధన్యమవుతుంది.   



Related Post