 
                                        కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయచట్టాలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని కోరుతూ పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు గత 13 రోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. అప్పటి నుంచి కేంద్రమంత్రులు వారి ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నప్పటికీ చర్చలు విఫలమవుతూనే ఉన్నాయి. వ్యవసాయ చట్టాలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తుంటే, రైతులు కోరినట్లు చట్ట సవరణలు చేస్తాము తప్ప చట్టాన్ని ఉపసంహరించుకొనే ప్రసక్తి లేదని కేంద్రప్రభుత్వం చెపుతుండటంతో చర్చలు విఫలమవుతున్నాయి. 
ఇప్పటివరకు జరిగిన సమావేశాలు విఫలం అవడంతో ఈసారి కేంద్రహోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలో దిగారు. మంగళవారం రాత్రి ఢిల్లీలోని పూసా అనే ప్రాంతంలోగల వ్యవసాయ పరిశోధన సంస్థ ఆవరణలో 13 మంది రైతు ప్రతినిధులతో అమిత్ షా సమావేశమయ్యారు. అమిత్ షా అక్కడకు చేరుకోగానే “వ్యవసాయచట్టం రద్దు చేస్తారా లేదా? అనే ప్రశ్నకు ఔను...లేదు…” అని మాత్రమే మీ నుంచి సమాధానం ఆశిస్తున్నామని రైతు ప్రతినిధులు ముందే చెప్పేశారు. “చట్టం రద్దు చేయలేము కానీ మీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని కొన్ని చట్టసవరణలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని, ఆ వివరాలను పరిశీలించిన తరువాత అంగీకరమైతే మళ్ళీ చర్చలకు కూర్చోందామని” అమిత్ షా సూచనకు రైతులు అభ్యంతరం చెప్పారు. కానీ ఆయన అందజేసిన ఆ చట్టసవరణ జాబితాను తీసుకొని వెళ్ళిపోయారు. కనుక ఇప్పుడు బంతి రైతుల కోర్టులోనే ఉన్నట్లు భావించవచ్చు.
గత 13 రోజులుగా గజగజమని వణికించే చలిలో రోడ్లపైనే ఉంటూ ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులు ఓ మెట్టు దిగి చట్టసవరణలకు అంగీకరిస్తారా లేదా? ఒకవేళ అంగీకరించకపోతే కేంద్రప్రభుత్వం ఏమి చేస్తుంది? అనే సందేహాలకు త్వరలోనే సమాధానాలు లభించవచ్చు. ఈ ఆందోళనలు ఇంకా ఇలాగే కొనసాగితే కాంగ్రెస్‌తో సహా దేశంలో బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలు ఒక్కతాటిపైకి వస్తే సమస్య ఇంకా తీవ్రం అవుతుంది కనుక కేంద్రప్రభుత్వం వ్యవసాయచట్టాలను రద్దు చేయక తప్పదేమో? కానీ ఆవిధంగా చేసినట్లయితే, మున్ముందు కేంద్రప్రభుత్వం ఏ చట్టం చేసినా, ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దానిని వ్యతిరేకిస్తూ ఇదేవిధంగా ఆందోళనలు చేసి కేంద్రాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించవచ్చు. కనుక ఈవిషయంలో కేంద్రానికి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుంది.