కరోనా వ్యాక్సిన్‌ కోసం హైదరాబాద్‌కు క్యూ కట్టిన 64 దేశాలు

December 09, 2020


img

ఏడాదిగా యావత్ ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకొనేందుకు భారత్‌తో సహా అమెరికా, రష్యా, చైనా తదితర దేశాలు వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్నాయి. భారత్‌లో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్ కంపెనీ ‘కోవాక్సిన్’ పేరుతో కరోనా నివారణకు ఓ టీకాను తయారుచేసింది. దాని ప్రయోగాలలో మంచి ఫలితాలు వస్తుండటంతో ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా భారత్‌ బయోటెక్ కంపెనీకి వెళ్ళి పరిశీలించి, వచ్చారు. 

ప్రధాని నరేంద్రమోడీ పర్యటించి వెళ్ళగానే భారత్‌ బయోటెక్ కంపెనీ, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా, ఫైజర్ కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి, సరఫరా చేసేందుకు డీసీజీఐకి దరఖాస్తు చేసుకొన్నాయి. కేంద్రప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడంతో త్వరలోనే అవి వ్యాక్సిన్‌ ఉత్పత్తి ప్రారంభించబోతున్నాయి. జనవరి 21వ తేదీ నుంచి భారత్‌లో ఆ మూడు వ్యాక్సిన్‌లను పంపిణీ చేసేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు మొదలుపెట్టాయి కూడా. 

ఈనేపధ్యంలో భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవాక్సిన్ పరిశోదన, నాణ్యత, క్లినికల్ ట్రయల్స్‌, ఫలితాలు, పురోగతి, కంపెనీ వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్ధ్యం తదితర అంశాల గురించి తెలుసుకొనేందుకు 64 దేశాలకు చెందిన రాయబారులు, హైకమీషనర్లు ఇవాళ్ళ హైదరాబాద్‌ చేరుకొన్నారు. వారందరూ రెండు బృందాలుగా విడిపోయి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో భారత్‌ బయోటెక్ కంపెనీ, బయలాజికల్-ఈ కంపెనీలకు వెళ్లారు. బయాలజికల్-ఈ కంపెనీకి వెళ్ళిన బృందం ఆ కంపెనీ వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్ధ్యం తదితర అంశాలను పరిశీలించింది. తరువాత వారు భారత్‌ బయోటెక్ కంపెనీకి చేరుకొన్నాక ఆ కంపెనీ ఛైర్మన్‌ కృష్ణ ఎల్లా వారందరికీ తమ కంపెనీ తయారుచేసిన కోవాక్సిన్ టీకా గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. 

హైదరాబాద్‌ పర్యటన ముగిసిన తరువాత ఈరోజు సాయంత్రం విదేశీరాయబారులు, హైకమీషనర్లు అందరూ ఢిల్లీ చేరుకొంటారు. వారితో ప్రధాని నరేంద్రమోడీ లేదా విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, కేంద్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. కరోనా వ్యాక్సిన్‌ కోసం 64 దేశాలు హైదరాబాద్‌కు క్యూకట్టడం చాలా గొప్పవిషయమే. అది మనందరికీ గర్వకారణమే కదా?


Related Post