పిసిసి అధ్యక్ష అభ్యర్ధిపై నేడు తుది నిర్ణయం?

December 09, 2020


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతికబాధ్యత వహిస్తూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ఎవరిని అధ్యక్షుడిగా ఉండాలనే దానిపై చర్చించేందుకు నేడు పార్టీ సీనియర్ నేతలందరూ గాంధీభవన్‌లో సమావేశం కానున్నారు.

పిసిసి అధ్యక్ష పదవికోసం పార్టీలో వి.హనుమంతరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డి, జగ్గారెడ్డి పోటీలో ఉన్నారు తాజాగా మాజీ ఎంపీ మధుయాష్కీ తాను కూడా పోటీలో ఉన్నానని ప్రకటించారు. వీరుకాక మరికొందరు సీనియర్ నేతలు కూడా ఈ పదవికి పోటీ పడుతుండటంతో వారితో సహా సీనియర్ నేతలందరూ నేడు గాంధీభవన్‌లో సమావేశమయ్యి ఈ అంశంపై చర్చించనున్నారు. కనుక ఈరోజు సమావేశం చాలా వాడివేడిగా సాగవచ్చు చివరికి రసాభాసగా ముగిసీనా ఆశ్చర్యం లేదు. అయితే దీనిపై కాంగ్రెస్‌ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది కనుక రేపటి నుంచి ఈ పంచాయతీ ఢిల్లీకి మారవచ్చు. కానీ అధిష్టానం ఎవరిని అభ్యర్ధిగా నియమించినప్పటికీ మిగిలినవారు తీవ్ర అసంతృప్తి చెందడం తధ్యం. ముఖ్యంగా రేవంత్‌ రెడ్డిని నియమించినట్లయితే మిగిలినవారు తీవ్ర అసంతృప్తి, అసహనానికి లోనయ్యి తీవ్ర నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుంది. కనుక పిసిసి అధ్యక్షుడి ఎంపిక కాంగ్రెస్‌ అధిష్టానానికి కత్తి మీద సామువంటిదే అని చెప్పవచ్చు. 


Related Post