ఒళ్ళు దగ్గరపెట్టుకొని పనిచేయకపోతే ప్రజలు బుద్ది చెపుతారు

December 08, 2020


img

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారత్‌ బంద్‌లో పాల్గొంటున్నారు. సికింద్రాబాద్‌లో బంద్‌లో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “రైతులు ఆందోళనలు చేస్తుంటే సమస్య లేదని కేంద్రప్రభుత్వం చెపుతుండటం హాస్యాస్పదంగా ఉంది. సమస్య లేకపోతే రైతులు రోడ్లపైకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తారు? కేంద్రప్రభుత్వం రైతులతో ఎందుకు చర్చలు జరుపుతోంది? రైతులతో మాట్లాడి వారిని ఒప్పిస్తే అసలు ఈ సమస్యే ఉండేది కాదుకదా? రైతుల సమస్య పరిష్కరించకుండా వారికి మద్దతు ఇస్తున్న విపక్షాలను నిందించడం ఎందుకు?ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం బెట్టువీడి వ్యవసాయచట్టాలను వెనక్కు తీసుకోవాలి లేకుంటే ఈ పోరాటాలు ఉదృతం అవుతాయి. అయినా అధికారం ఉందికదా అని తన ఇష్టం వచ్చినట్లు చేస్తే కుదరదు. ప్రభుత్వాలు ఒళ్ళు దగ్గరపెట్టుకొని పనిచేస్తే మంచిది లేకుంటే ప్రజలు బుద్ది చెపుతారు. మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. 

దేశంలో రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పధకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది సిఎం కేసీఆర్‌. ఆయనను చూసి కేంద్రప్రభుత్వం నేర్చుకోవాలి. కనుక ఈవిషయంలో కేంద్రప్రభుత్వం మమ్మల్ని విమర్శించలేదు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో ఓటమిని కప్పిపుచ్చుకొనేందుకు మేము బంద్‌కు మద్దతుయిస్తున్నామని బిజెపి ఆరోపించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. పార్లమెంటులో వ్యవసాయ చట్టాలు ప్రవేశపెట్టినప్పుడే మేము వాటిని వ్యతిరేకించాము. నేటికీ దానికే కట్టుబడి ఉన్నాము. అందుకే నేడు బంద్‌లో పాల్గొంటున్నాము తప్ప ఏవో రెండు ఎన్నికలలో ఓడిపోతే భయపడికాదు. 

రైతులకు మరింత లాభపడాలనే ఉద్దేశ్యంతోనే సన్నరకం బియ్యం పండించమని ప్రభుత్వం సూచించింది తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. సన్నబియ్యానికి గిట్టుబాటుధర నిర్ణయించవలసింది కేంద్రప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా?మరి మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నారు?

సిఎం కేసీఆర్‌ అమలుచేస్తున్న పలు పధకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతాంగం కొలుకోంటోంది. వారిని కేంద్రప్రభుత్వం కొత్త వ్యవసాయచట్టలతో దెబ్బతీయాలని ప్రయత్నిస్తే మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మా రైతుల ప్రయోజనాలు కాపాడటం కోసం మేము ఎన్ని పోరాటాలైన చేయడానికి సిద్దంగా ఉన్నాము,” అని అన్నారు. 

ప్రజాసమస్యలపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు, బాధితవర్గాలు ధర్నాలు, ఆందోళనలు చేస్తామంటే అనుమతించని సిఎం కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు బంద్‌లో పాల్గోమని పార్టీ శ్రేణులను, ప్రజలను కోరుతున్నారు? అని విలేఖరి అడిగిన ప్రశ్నకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ‘రైతుల కోసమే కదా...’అంటూ సమాధానం దాటవేశారు.


Related Post